Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఐడెంటిటీ పోరాటాలు!

టాలీవుడ్ లో కథల ఎంపిక, కథనాల శైలి వేగంగా మారుతున్నాయి.

By:  Srikanth Kontham   |   22 Sept 2026 8:00 PM IST
టాలీవుడ్ లో ఐడెంటిటీ పోరాటాలు!
X

టాలీవుడ్ లో కథల ఎంపిక, కథనాల శైలి వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ల చుట్టూ తిరిగిన టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు `ఐడెంటిటీ`, `ఆత్మగౌరవం` అనే బలమైన భావోద్వేగాల చుట్టూ అల్లుకుంటున్నాయి. ఈ ఆత్మగౌరవ పోరాటాలే టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ ఫార్ములాగా మారాయి. ప్రేక్షకుల గుండెల్లోకి నేరుగా దూసుకెళ్లే ఎమోషన్ పాయింట్ ఆధారంగానే టాలీవుడ్ ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌లు కొత్త కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు కథానాయకుడు పగ, ప్రతీకారం లేదా కుటుంబ గౌరవం కోసం పోరాడేవాడు. కానీ నేటి తరం సినిమాలో కథానాయకుడి అసలు పోరాటం ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం, సమాజంలో ఉనికిని చాటుకోవడం కోసమే సాగుతోంది. తక్కువ చేసి చూసిన వర్గాలు, తొక్కిపెట్టబడిన మూలాలు లేదా గుర్తింపు లభించని మట్టి మనుషుల నేపథ్యం నుంచి వచ్చి.. ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడే కథలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఈ పాయింట్ సృష్టించే హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లలో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నెటివిటీ, ప్రాంతీయ యాస, స్థానిక సంస్కృతులను కథల్లో భాగంగా మార్చి, వాటి చుట్టూ ఐడెంటిటీ పోరాటాన్ని అల్లడంలో నేటి తరం దర్శకులు సిద్ధహస్తులయ్యారు. తెలంగాణ, రాయలసీమ లేదా కోస్తా ఆంధ్ర గ్రామీణ నేపథ్యాల్లో ఉండే సామాజిక వ్యత్యాసాలు, అక్కడి మనుషులు ఎదుర్కొనే వివక్షను కథాంశాలుగా ఎంచు కుంటున్నారు. విలన్‌తో చేసే భౌతిక పోరాటం కంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యవస్థపై లేదా భావజాలంపై నాయకుడు చేసే పోరాటంలోనే అసలైన మాస్ ఎలిమెంట్ ఉందని దర్శకులు నమ్ముతున్నారు.

ఈ ఐడెంటిటీ ఫార్ములా ఇంతగా వర్కవుట్ కావడానికి కారణం ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పే. ముఖ్యంగా నేటి యూత్ స్వయంకృషి, ఆత్మగౌరవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెరపై కథానాయకుడు అవమానాలను తట్టుకుని ఉనికి కోసం పోరాడి విజయం సాధిస్తుంటే.. ప్రేక్షకులు ఆ పాత్రలో తమను తాము చూసుకుంటున్నారు. కథానాయకుడు సాధించే ప్రతీ విజయం ప్రేక్షకుడికి ఆత్మీయ అనుభూతిని, మానసిక ఉపశమనాన్ని అందిస్తుండటంతో ఈ తరహా కథలకు ఆదరణ లభిస్తోంది.

ఈ మార్పు టాలీవుడ్ స్టార్ హీరోల పాత్రల రూపకల్పనను కూడా మార్చివేసింది. మూస ధోరణిలో ఉండే సూపర్ మ్యాన్ తరహా పాత్రల కంటే లోపాలు ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కోసం తపించే పాత్రల్లో నటించేందుకే కొంత మంది అగ్ర హీరోలు సైతం మొగ్గు చూపుతున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రమే కాకుండా నటనలో లోతును ప్రదర్శిం చేందుకు ఐడెంటిటీ కథలు ఉపకరిస్తున్నాయి. దీంతో అగ్ర నటుల నుంచి వర్ధమాన హీరోల వరకు ప్రతీ ఒక్కరూ త‌దుప‌రి ప్రాజెక్ట్‌లలో ఆత్మగౌరవ కోణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది.

మొత్తానికి టాలీవుడ్‌లో గుర్తింపు, ఆత్మగౌరవ పోరాటాలు ఓ సరికొత్త పునర్వైభవానికి శ్రీకారం చుడుతున్నాయి. ఏదైనా ఫార్ములా అతిగా వాడితే రొటీన్‌గా మారే ప్రమాదం ఉన్నా? మానవ సహజమైన ఆత్మగౌరవాన్ని నిజాయితీగా, బలమైన కథనంతో తెరపైకి తెచ్చినంత కాలం ఇలాంటి కథలకు బాక్సాఫీస్ వద్ద తిరుగుండదు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఐడెంటిటీ ఫార్ములా ఆధారంగా మరిన్ని వైవిధ్యభరితమైన సినిమాలు తెలుగు తెరపై సందడి చేయను న్నాయనడంలో సందేహం లేదు.