Begin typing your search above and press return to search.

టాప్ స్టోరీ: బ్యాక్ గ్రౌండ్‌తో కాదు ప్ర‌తిభ‌తో స్టార్‌డ‌మ్

వలం టాలెంట్‌ను నమ్ముకుని.. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `సెల్ఫ్ మేడ్` స్టార్ల గురించి వివ‌రాల్లోకి వెళితే....

By:  Sivaji Kontham   |   1 March 2026 10:14 AM IST
టాప్ స్టోరీ: బ్యాక్ గ్రౌండ్‌తో కాదు ప్ర‌తిభ‌తో స్టార్‌డ‌మ్
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వారసత్వం (నేపోటిజం) అనేది ఒక బలమైన గోడలా కనిపిస్తుంది. కానీ గత ఏడెనిమిదేళ్లలో ఆ గోడలను బద్దలు కొట్టుకుంటూ.. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సామాన్యులుగా వచ్చి.. నేడు కోట్లు సంపాదిస్తూ స్టార్‌లుగా వెలుగుతున్న వారు ఎందరో ఉన్నారు. కేవలం టాలెంట్‌ను నమ్ముకుని.. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `సెల్ఫ్ మేడ్` స్టార్ల గురించి వివ‌రాల్లోకి వెళితే....

టాలీవుడ్ లో ఈ ఏడెనిమిదేళ్ల‌లో ఎదిగిన స్టార్లు:

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం స్టార్ బాయ్ గా పాపుల‌రైన‌ సిద్ధు జొన్నలగడ్డ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టిన సిద్ధు 2022లో వచ్చిన `డీజే టిల్లు`తో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యారు. ఆయన రాసిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ యువతను పిచ్చెక్కించాయి. అలాగే నవీన్ పొలిశెట్టి ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి, వేల సంఖ్యలో ఆడిషన్లు ఇచ్చి `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో హిట్ కొట్టి, `జాతిరత్నాలు`తో 100 కోట్ల వసూళ్లను సాధించి నేడు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు. వీరంద‌రికంటే ముందే అడివి శేష్ టాలీవుడ్ లో స్టార్ గా నిరూపించారు. అడివి శేష్ హీరోగానే కాకుండా ర‌చ‌యిత‌గా ద‌ర్శ‌కుడిగాను రాణిస్తున్నారు. సుహాస్, విశ్వ‌క్ సేన్ హీరోలుగా స్థిరంగా వ‌ర‌స చిత్రాల్లో న‌టిస్తూ త‌మ స్థాయిని నిరూపించుకుంటున్నారు.

చిన్న పట్టణం నుండి వచ్చి, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, `రాజా వారు రాణి గారు` సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఎటువంటి సపోర్ట్ లేకుండానే వరుస సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన నటించిన `క` (కేఏ) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు రాబట్టి అతడి స్టాటస్‌ను మరింత పెంచింది. నాని, నిఖిల్ లాంటి వేవ్ త‌ర్వాత వీరంతా టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ స్టార్లుగా వెలుగొందుతున్నారు.

బాలీవుడ్ లో ఈ ఏడెనిమిదేళ్ల‌లో ఎదిగిన స్టార్లు

బాలీవుడ్‌లో ఔట్‌సైడర్లకు గడ్డుకాలం నడుస్తున్న తరుణంలో కార్తీక్ ఆర్యన్ ఒక వెలుగులా కనిపిస్తున్నారు. గ్వాలియర్ నుండి వచ్చి, ఇంజనీరింగ్ చదువుతూ ఆడిషన్లకు హాజరైన కార్తీక్ `ప్యార్ కా పంచనామా`తో గుర్తింపు పొంది..`భూల్ భూలయ్యా 2`తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రక్షించారు. నేడు ఆయన ఒక్కో సినిమాకు రూ.40-50 కోట్లు తీసుకునే స్థాయికి చేరారు. ఇక `యానిమల్` చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తి డిమ్రి కూడా ఎటువంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇప్పుడు బాలీవుడ్ టాప్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న స్పిరిట్ లో అవ‌కాశం అందుకోవ‌డం ట్రిప్తీకి గేమ్ ఛేంజ‌ర్ గా మార‌బోతోంది. ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, విక్రాంత్ మాస్సే, రాఘ‌వ్ జుయ‌ల్ వంటి స్టార్లు సినీనేప‌థ్యం లేకుండానే పెద్ద స్టార్లుగా ఎదిగారు.

కోలీవుడ్ నుంచి ఎవ‌రెవ‌రు?

తమిళ పరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన శివకార్తికేయన్ ఇప్పుడు అక్కడ ఒక మినీ సూపర్ స్టార్. మిమిక్రీ ఆర్టిస్టుగా, టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి, నేడు కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఈ నాలుగైదేళ్లలో ఆయన నటించిన డాక్టర్, డాన్, అమరన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఆయనకే చెల్లింది. ఇటీవ‌లి కాలంలో కొంద‌రు యువ‌హీరోలు కోలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా దూసుకెళుతున్నారు.

స‌మకాలీన ప్ర‌పంచంలోకి వేగంగా దూసుకొచ్చి 100 కోట్ల క్ల‌బ్ హీరోగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్. అత‌డు న‌టించిన ల‌వ్ టుడే 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. కోమ‌లి చిత్రంతో కెరీర్ ప్రారంభించి ల‌వ్ టుడే తో ద‌ర్శ‌క‌న‌టుడిగా, ర‌చ‌యిత‌గా పెద్ద స‌క్సెస‌య్యాడు. ల‌ఘు చిత్రాల‌తో కెరీర్ ప్రారంభించిన ప్ర‌దీప్ అనూహ్యంగా న‌టుడు అయ్యాడు. ఇప్పుడు 10-15 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నాడు. ధ‌నుష్ త‌ర్వాత మ‌ళ్లీ అంతే స‌హ‌జంగా న‌టించే కోలీవుడ్ స్టార్ గా అత‌డు గుర్తింపు తెచ్చుకున్నాడు. ధ‌నుష్ కంటే వేగంగా తెలుగు ప్రేక్ష‌కుల‌లోను అత‌డు అభిమానం సంపాదించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. శివ‌కార్తికేయ‌న్, ప్ర‌దీప్ ల‌తో పాటు, హ‌రీష్ క‌ళ్యాణ్‌, అశోక్ సెల్వ‌న్, కెవిన్ లాంటి యువ‌హీరోలు రైజింగ్ స్టార్స్ గా కోలీవుడ్ లో బిజీ బిజీగా కెరీర్ ని నిర్మించుకుంటున్నారు.

కన్నడ & మలయాళ రంగం నుంచి..

కన్నడ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ఒక అద్భుతం. డ్రైవర్‌గా, క్లాప్ బాయ్‌గా పనిచేసిన ఆయన `కాంతార` సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి వారసత్వం లేకపోయినా.. తన సొంత గ‌డ్డ‌- మట్టి కథల‌తో కోట్లు సంపాదించడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇక మలయాళంలో టోవినో థామస్ `మిన్నల్ మురళి` వంటి చిత్రాలతో గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆయన ఒక ఇంజనీర్‌గా కెరీర్ వదిలి కేవలం కష్టాన్ని నమ్ముకుని మాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు.

నేడు ప్రేక్షకులు నేపో కిడ్ నా? ఔట్‌సైడరా? అని చూడటం లేదు. కేవలం `కంటెంట్` బాగుంటే చాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. పైన పేర్కొన్న హీరోలందరూ సినీ నేపథ్యం లేకపోయినా.. తమ స్వయంకృషితో కోట్లాది రూపాయల ఆస్తులను, అంతకు మించి అభిమానాన్ని సంపాదించుకున్నారు. వారసత్వం అనేది కేవలం మొదటి సినిమా వరకే దారి చూపిస్తుంది.. కానీ నిలబడాలంటే మాత్రం `టాలెంట్` ఒక్కటే మార్గమని వీరు నిరూపించారు.