ఆ పండక్కల్లా కమ్ముల క్లారిటీ ఇచ్చేస్తారేమో..
ఒక్కో సినిమాకు సంవత్సరాల సమయం తీసుకున్నా.. కథ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడని దర్శకుడు శేఖర్ కమ్ముల.
By: M Prashanth | 10 July 2026 11:55 AM ISTఒక్కో సినిమాకు సంవత్సరాల సమయం తీసుకున్నా.. కథ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడని దర్శకుడు శేఖర్ కమ్ముల. కుబేర తర్వాత ఆయన తదుపరి సినిమా ఏది? హీరో ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. శేఖర్ కమ్ముల కొత్త ప్రాజెక్టుపై దసరా పండుగ నాటికి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుబేర తర్వాత కొంతకాలంగా కొత్త కథపై పూర్తిగా దృష్టి పెట్టిన శేఖర్ కమ్ముల, దాదాపు ఏడాది పాటు వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కథతో పాటు డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం హీరో ఎంపికపైనే ఆయన మెయిన్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన కథకు పూర్తిగా సరిపోయే నటుడిని ఎంపిక చేసిన తర్వాతే అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ చిత్రాన్ని నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ నిర్మించే అవకాశాలున్నాయని చర్చ సాగుతోంది. అయితే హీరో విషయంలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో డేట్ల సమస్య ఎదురవుతోందని వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల సినిమాలంటే ఎక్కువ కాలం షూటింగ్ కు సమయం కేటాయించాల్సి ఉంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
ప్రతి సీన్ ను తనకు నచ్చిన స్థాయిలో తీర్చిదిద్దే వరకు ఆయన రాజీ పడరు. అందుకే హీరో ఎంపికలో కూడా తొందరపడకుండా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, ఆయన ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఇతర భాషలకు చెందిన యంగ్ హీరోలను శేఖర్ కమ్ముల పరిశీలించే అవకాశం ఉందని, కథకు ఎవరు బాగా సరిపోతారనే అంశానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
శేఖర్ కమ్ముల ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో కథ, రోల్స్, ఎమోషన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే కొత్త సినిమా విషయంలో కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈసారి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ విజయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హీరో డేట్లు ఖరారయ్యే దశలో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
అవి ఒక కొలిక్కి వచ్చిన వెంటనే సినిమా అనౌన్స్మెంట్ ఉండే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అందుకే శేఖర్ కమ్ముల అభిమానులు కూడా నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా వెలువడనప్పటికీ, సమాచారం ప్రకారం దసరా సమయానికి హీరోతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఎవరితో ఉండబోతోందనే సస్పెన్స్ రోజురోజుకూ పెరుగుతోంది.
