Begin typing your search above and press return to search.

నిజానికి అత‌డే పెద్ద హీరో: ద‌ర్శ‌కుడు అర్జున్

అర్జున్ ఈ వేడుకలో రియల్ హీరోలను సన్మానించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. డాక్టర్ ప్రకాష్ ఆమ్టే త్యాగం ఒక సినిమా హీరో చేసే దానికంటే వేల రెట్లు గొప్పదని కొనియాడారు.

By:  Sivaji Kontham   |   11 Feb 2026 9:30 AM IST
నిజానికి అత‌డే పెద్ద హీరో: ద‌ర్శ‌కుడు అర్జున్
X

యాక్ష‌న్ కింగ్ అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సీతా ప‌య‌నం` ప్రీరిలీజ్ వేడుక యూనిక్ కాన్సెప్ట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఫిబ్ర‌వ‌రి 14న‌ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నిరంజన్ - ఐశ్వర్య నాయ‌కానాయిక‌లు. శ్రీరామ ఫిలింస్ నిర్మించింది. సీతా పయనం` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అర్జున్‌, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం త‌దిత‌రులు పాల్గొన్నారు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా కేవలం గ్లామర్‌కే ప్రాధాన్యత ఇవ్వకుండా, సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రకాష్ ఆమ్టే, దుశ్చర్ల సత్యనారాయణ, ట్యాంక్ బండ్ శివ వంటి రియల్ హీరోలను ఆహ్వానించి వారిని సన్మానించారు.

సీతా పయనం చిత్రానికి దర్శకత్వం వహించిన యాక్షన్ కింగ్ అర్జున్ ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ..ఈ సినిమాను ఒక ప్రాజెక్ట్‌గా కాకుండా తన మనసుకు చాలా దగ్గరైన కథగా భావిస్తున్నానని చెప్పారు. ఇది కమర్షియల్ హంగులతో పాటు మానవత్వాన్ని చాటిచెప్పే కథ అని, ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయని ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ముగ్గురు రియల్ హీరోల గురించి:

అర్జున్ ఈ వేడుకలో రియల్ హీరోలను సన్మానించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. డాక్టర్ ప్రకాష్ ఆమ్టే త్యాగం ఒక సినిమా హీరో చేసే దానికంటే వేల రెట్లు గొప్పదని కొనియాడారు. అలాగే 70 ఎకరాల అడవిని పెంచి, దాన్ని పక్షులకు అంకితం చేయడం అనేది ఒక అద్భుతమని, దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతి ప్రేమికులకు ఆదర్శమని అన్నారు. ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ట్యాంక్ బండ్ శివ గురించి ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు అర్జున్. ఈ రియల్ హీరోల సేవలకు మద్దతుగా ఒక లక్ష రూపాయల చెక్కును అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని చెప్పారు.

తన కుమార్తె ఐశ్వర్య గురించి మాట్లాడుతూ.. తండ్రిగా కంటే ఒక దర్శకుడిగా ఐశ్వర్య నటన పట్ల తాను గర్వపడుతున్నానని అర్జున్ చెప్పారు. ఐశ్వర్య తన పాత్రలో చాలా పరిణితితో కూడిన నటనను ప్రదర్శించిందని, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో తనను తాను నిరూపించుకుందని ప్రశంసించారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు.

ట్యాంక్ బండ్ శివ గురించి అర్జున్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. శివ తనను చిన్నప్పటి నుండి ఒక హీరోగా ఆరాధిస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయానని, కానీ నిజానికి శివనే ఒక పెద్ద హీరో అని కొనియాడారు. వందలాది ప్రాణాలను కాపాడటం అనేది దైవకార్యమని, శివ లాంటి అభిమాని తనకు ఉండటం గర్వకారణమని చెప్పారు. శివ, ఆయన భార్య శాంతల అనుబంధం చూసి ముచ్చటగా ఉందని, వారి నిరాడంబరత తనకు బాగా నచ్చిందని పేర్కొన్నారు.

ఓవ‌రాల్‌గా అర్జున్ గారు తన ప్రసంగంలో సినిమా ప్రచారం కంటే సమాజం పట్ల బాధ్యతను, మానవత్వాన్ని ఎలివేట్ చేస్తూ మాట్లాడటం ఈ వేడుకకే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.