Begin typing your search above and press return to search.

12 ఏళ్ల సినీ ప్ర‌యాణం: 'రన్ రాజా రన్' బుజ్జిమా ఎమోషనల్ పోస్ట్

`రన్ రాజా రన్` చిత్రంలో `బుజ్జిమా` పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సీరత్ కపూర్ చిత్రపరిశ్రమలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తయ్యాయి.

By:  Sivaji Kontham   |   30 July 2026 11:41 PM IST
12 ఏళ్ల సినీ ప్ర‌యాణం: రన్ రాజా రన్ బుజ్జిమా ఎమోషనల్ పోస్ట్
X

`రన్ రాజా రన్` చిత్రంలో `బుజ్జిమా` పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సీరత్ కపూర్ చిత్రపరిశ్రమలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తయ్యాయి. కొరియోగ్ర‌ఫీ నుంచి న‌ట‌న‌లోకి ప్ర‌వేశించిన ఈ బ్యూటీ జ‌ర్నీ ఆద్యంతం ఆస‌క్తిక‌రం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీర‌త్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ నోట్‌ను షేర్ చేశారు. 12 సంవత్సరాలు... లెక్కలేనన్ని పాఠాలు..అంతులేని కృతజ్ఞత. ఇప్పటికీ నేర్చుకుంటూ.. రూపాంతరం చెందుతూ నన్ను కదిలించే కథలనే ఎంచుకుంటున్నాను! అంటూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.




ఈ ప్రత్యేక వేడుక కోసం సీరత్ కపూర్ చేసిన గ్లామరస్ ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కటికి ఇషికా అగర్వాల్ అవుట్‌ఫిట్, మోజాతి జ్యువెలరీ ధరించి అజయ్ పాటిల్ ఫోటోగ్రఫీలో ఈ డ్యాన్సింగ్ బ్యూటీ మెరిసిపోయిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బేకర్ సహా పలువురు సెలబ్రిటీలు ..ఫ్యాన్స్ లవ్, ఫైర్ ఈమోజీలతో శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.




ఇదే సమయంలో సౌత్ సినిమా తన నటనను ఎలా తీర్చిదిద్దిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సీరత్ వెల్ల‌డించారు. విభిన్న భాషలు, సంస్కృతులలో పనిచేయడం వల్ల నటిగా తను మరింత సహజంగా, అనుకూలంగా మారగలిగానని పేర్కొన్నారు. ``మానవ భావోద్వేగాలకు సబ్‌టైటిల్స్ అవసరం లేదు`` అని నమ్మే సీరత్, ట్రెండ్స్ మారినా మనం చేసే మంచి పని ద్వారా సంపాదించుకునే గౌరవమే ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం నిలబెడుతుందని స్పష్టం చేశారు.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న సీరత్... పాత్రల కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడనని నిరూపిస్తున్నారు. తన త‌దుప‌రి చిత్రం `జాతస్య మరణం ధ్రువం` క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో చేతిగాజుల వల్ల మణికట్టు వాచిపోయి గాయపడినా సినిమాపై ఉన్న ప్రాణంతో చిత్రీకరణ పూర్తి చేశారు. పద్ధతిగల అభినయం కోసం ఇటువంటి అనుభవాలు సహజమేనని...సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల ఆదరణతో ఈ కష్టమంతా మర్చిపోతానని ఈ యంగ్ బ్యూటీ తెలిపారు.

సీనియర్ నటుడు జేడీ చక్రవర్తితో కలిసి సీరత్ కపూర్ నటించిన `జాతస్య మరణం ధ్రువం` చిత్రం వచ్చే నెల ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తన 12 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ భామ.. మునుముందు కొత్త అధ్యాయంలో ఎలాంటి వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.