చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?
తమిళనాడులో కొత్త సినిమాలకు ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నటుడు, రాజకీయ నాయకుడు సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, తెల్లవారుజామున షోల కోసం యువత చదువు, ఉద్యోగాలను పక్కనపెట్టి థియేటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. సినిమాలకు తాను వ్యతిరేకం కాదని, తమిళ సంస్కృతిని ప్రోత్సహించే చిత్రాలకు సాయం, పైరసీ నియంత్రణ, టికెట్ ధరల కట్టడి వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో నిర్మాతల వాణిజ్య ప్రయోజనాలు, సామాజిక బాధ్యతపై కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.
By: Srikanth Kontham | 6 Nov 2026 5:10 PM ISTతమిళనాడులో కొత్త సినిమాల ప్రదర్శన కోసం ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నటుడు, రాజకీయ నాయకుడు సీమాన్- తమిళ సినిమా నిర్మాతల మండలి మధ్య ఆసక్తికరమైన వాదనలు నడుస్తున్నాయి. నిర్మాతలు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా సీమాన్ మాత్రం దీనివల్ల యువతపై పడే ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార కోణంలోనే కాకుండా సామాజిక బాధ్యత దృష్ట్యా ఈ అంశాన్ని పరిశీ లించాలని కోరడం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తమిళనాడులో కొత్త సినిమాలు విడుదలైన తొలి ఏడు రోజులు ఉదయం 6 గంటల షోలకు.. రోజుకు ఆరు ప్రదర్శ నలకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ తమిళ చిత్రాలకు ఇలాగే తెల్లవారుజామున షోలు పడుతున్నాయని.. కానీ తమిళనాడులో మాత్రం ఉదయం 9 గంటల నిబంధన ఉండటం వల్ల నెగెటివ్ రివ్యూలు త్వరగా స్ప్రెడ్ అవుతున్నాయని నిర్మాతలు వాదిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ గట్టిగా సమర్థించింది.
నిర్మాతల వాదనను ఉద్దేశించి స్పందించిన సీమాన్, సినిమా పరిశ్రమ పడుతున్న కష్టాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు తనకు తెలుసని స్పష్టం చేశారు. తమిళ సినిమా అభివృద్ధి చెందాలని కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని తెలిపారు. అయితే ప్రతీ కొత్త సినిమాకు సంవత్సరం పొడవునా ఉదయం 6 గంటల నుంచే ఆరు షోలు వేయడం నిజంగా అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు.
ఉదయం పూట థియేటర్ల వద్ద యువత గంటల తరబడి వేచి ఉండటం, తమ దినచర్యను, ఉద్యోగాలను, చదువులను విస్మరించి వినోదం వెనుక పరుగులు తీయడం తనను ఆందోళనకు గురిచేస్తోందని సీమాన్ పేర్కొన్నారు. విద్య, ఉపాధి, బాధ్యతాయుతమైన జీవితం వంటి అంశాలను పక్కన పెట్టి కేవలం సినిమాల చుట్టూ తిరగడం సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న లేవనెత్తానని వివరించారు.
సినిమాలపై తనకు వ్యతిరేకత లేదని స్పష్టం చేసిన సీమాన్, భవిష్యత్తులో తమ ప్రభుత్వం వస్తే తమిళ భాష, సంస్కృతిని ప్రోత్సహించే చిత్రాలకు ఆర్థిక సాయం అందించడం, నాణ్యమైన సినిమాలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, పైరసీని అరికట్టడం వంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. థియేటర్లలో టికెట్లు, పార్కింగ్, తినుబండారాల ధరలను నియంత్రించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందున ఈ అంశంపై ఇకపై ఎలాంటి చర్చను కొనసాగించబోనని సీమాన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ బాగుండాలని.. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కమర్షియల్ ప్రయోజనాలు వర్సెస్ సామాజిక బాధ్యత అనే కోణంలో ఈ వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
