Begin typing your search above and press return to search.

Tupaki Exclusive: 'సీక్రెట్‌ సోల్జర్‌' టైటిల్‌ వెనుక అసలు కథ ఇదే!

ఈ విషయాలపై Tupaki Exclusive ఇంటర్వ్యూలో దర్శకుడు, హీరో నిహాల్‌, హీరోయిన్‌ శ్రిషా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెప్టెంబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  M Prashanth   |   8 Sept 2026 7:35 PM IST
Tupaki Exclusive: సీక్రెట్‌ సోల్జర్‌ టైటిల్‌ వెనుక అసలు కథ ఇదే!
X

ఎన్నో అడ్డంకులు దాటుకుని సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ముందు మరో టైటిల్‌ తో తెరకెక్కిన ఆ సినిమాకు సెన్సార్‌ ప్రక్రియలో టైటిల్‌ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ మార్పు వెనుక అసలు కారణం ఏంటి? టైటిల్‌ కోసం మూవీ టీమ్ ఎంతవరకు పోరాడింది? కొత్త టైటిల్‌ కథకు ఎలా సరిపోయింది? ఈ విషయాలపై Tupaki Exclusive ఇంటర్వ్యూలో దర్శకుడు, హీరో నిహాల్‌, హీరోయిన్‌ శ్రిషా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెప్టెంబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైటిల్‌ మార్పుపై దర్శకుడు మాట్లాడుతూ.. ముందుగా అనుకున్న టైటిల్‌ ను కొనసాగించే అవకాశం తమ చేతుల్లో లేదని తెలిసినప్పుడే దాని కోసం పోరాడకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే సినిమా కథ, ఎమోషన్స్, అసలు ఉద్దేశం దెబ్బతినకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఆ విషయంలో తాము విజయం సాధించామని తెలిపారు.

కొత్తగా పెట్టిన సీక్రెట్‌ సోల్జర్‌ టైటిల్‌ సినిమాకు మరింత పాజిటివ్‌ వైబ్‌ తీసుకొచ్చిందని దర్శకుడు అభిప్రాయపడ్డారు. గత టైటిల్‌ కొంతమందికి క్యాచీగా అనిపించినా.. మరికొందరిలో నెగిటివ్ ఫీలింగ్ కలిగించే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు వచ్చిన టైటిల్‌ కు అలాంటి నెగెటివ్‌ ఫీలింగ్‌ లేదని, కథకు కూడా ఇది మరింత సరిపోతుందని చెప్పారు. సెన్సార్‌ ప్రక్రియ కూడా సాధారణంగా జరగలేదని వెల్లడించారు. సినిమా విషయంలో చాలా కాలం పాటు అబ్జర్వేషన్ జరిగిందని, ప్రతి వారం ఏదో ఒక డెవలప్మెంట్ కనిపించేదన్నారు. చివరకు సెన్సార్‌ పూర్తవడంతో విడుదలకు లైన్ క్లియర్ అయిందని చెప్పారు.

Tupaki Exclusive ఇంటర్వ్యూలో హీరో నిహాల్‌ తన కెరీర్‌ గురించి కూడా మాట్లాడారు. కొత్త హీరోగా అందరూ చేస్తున్న ప్రేమకథలు, కుటుంబ కథలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులను సంపాదించుకోవడం ముఖ్యమన్నారు. "అందరూ చేస్తున్న కథలే నేను కూడా చేస్తే నన్నే ఎందుకు చూడాలి? అందుకే ప్రత్యేకమైన సినిమా చేయాలి" అనే ఆలోచనతో సీక్రెట్‌ సోల్జర్‌ చేశానని తెలిపారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో యూజ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి రావడం తన సొంత నిర్ణయమని నిహాల్‌ చెప్పారు. ఈ నిర్ణయానికి తన తల్లిదండ్రులు పూర్తిగా మద్దతిచ్చారని తెలిపారు. వచ్చిన అవకాశాన్ని న్యూస్ చేసుకుని తనను, తన తల్లిదండ్రులను గర్వపడేలా చేయడమే తన లక్ష్యమన్నారు. ఇక సినిమాలో హీరోయిన్‌ శ్రిషా రోల్ కూడా చాలా కీలకంగా ఉంటుందని ఆమె తెలిపారు. తన పాత్ర చాలా స్ట్రాంగ్ గా, ధైర్యంగా ఉంటుందని చెప్పారు. కథలో తన పాత్ర కేవలం హీరోయిన్‌ గా ఉండదని.. అవసరమైనప్పుడు పోరాడే స్థాయిలో ఉంటుందని వెల్లడించారు. ముందు ఇలాంటి యాక్షన్‌ రోల్ చేయగలనా అనే డౌట్ కలిగినా.. ఈ ఛాన్స్ తనవైపే వచ్చినట్లు అనిపించి ఓకే చేశానని చెప్పారు.

సినిమా పూర్తిగా స్పై యాక్షన్‌ కథ కాదని దర్శకుడు స్పష్టం చేశారు. స్పై ఎలిమెంట్ కథలో ఒక భాగమేనని.. మొత్తం కథకు ఫ్రెండ్షిప్ ప్రధాన బలమని చెప్పారు. కథలోని నేషనల్ సెక్యూరిటీ, స్పై అంశాలు, అన్నీ స్నేహం చుట్టూనే సాగుతాయని తెలిపారు. అలా టైటిల్‌ మార్పు, సెన్సార్‌ ఆలస్యం వంటి ఎన్నో సమస్యలను దాటుకుని సీక్రెట్‌ సోల్జర్‌ విడుదలకు సిద్ధమైంది. Tupaki ఇంటర్వ్యూలో మూవీ టీం వెల్లడించిన విషయాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరి విభిన్నమైన కథతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 18న ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.