'సీక్రెట్ సోల్జర్' రిలీజ్ ఛాలెంజ్.. ఓ క్లారిటీ ఇచ్చిన నిర్మాత
చిన్న సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే, దాన్ని సరైన సమయంలో థియేటర్ల వరకు తీసుకురావడం మరో ఎత్తు.
By: M Prashanth | 30 Aug 2026 11:12 AM ISTచిన్న సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం ఒక ఎత్తు అయితే, దాన్ని సరైన సమయంలో థియేటర్ల వరకు తీసుకురావడం మరో ఎత్తు. ప్రస్తుతం టాలీవుడ్‌లో 'సీక్రెట్ సోల్జర్' టీమ్ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ సినిమా రిలీజ్ కోసం పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లను సంప్రదిస్తున్నారా అనే ప్రశ్నకు దర్శకుడు, నిర్మాత అక్కి విశ్వనాథ్ రెడ్డి ఒక వివరణ ఇచ్చారు.
సినిమాను పూర్తి చేసి ఎనిమిది నెలల పాటు చేతిలో పెట్టుకుని ఎదురుచూడటం అనేది ఎవరికైనా చాలా కష్టమైన విషయమని ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ మార్చాల్సి రావడం, కొత్తగా 'సీక్రెట్ సోల్జర్' అని ఫిక్స్ చేయడం లాంటి కారణాలతో రిలీజ్ లేట్ అయింది. మొదట్లో డిస్ట్రిబ్యూషన్ కోసం కొన్ని సంస్థల తలుపులు తట్టినా, పాత టైటిల్ ఇష్యూల వల్ల సినిమాను కొంతకాలం హోల్డ్ లో పెట్టాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
సినిమాను ఎంత ప్యాషనేట్ గా తీసినా, చివరికి కమర్షియల్ యాస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమని అక్కి విశ్వనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రిలీజ్ కి సంబంధించి థియేట్రికల్ ప్లానింగ్ తో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో కూడా సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే ఓటీటీ డీల్స్ కు సంబంధించిన అగ్రిమెంట్స్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాసెస్ అంతా తమకు పాజిటివ్ గా సాగుతోందని ఆయన చెప్పారు.
ఇక సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే పెద్ద సంస్థల అండ కచ్చితంగా అవసరం. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు పెద్ద బ్యానర్లు సపోర్ట్ ఇస్తున్న ట్రెండ్ నడుస్తోంది. అందుకే తమ సినిమాపై ఉన్న నమ్మకంతో, దీన్ని లార్జర్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేసే పెద్ద ప్రొడక్షన్ హౌస్ లతో అసోసియేట్ అయ్యేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నామని, కచ్చితంగా వారి సపోర్ట్ తీసుకుంటామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై అక్కి విశ్వనాథ్ రెడ్డి నిర్మించారు. ఇందులో నిహాల్ 'వాలి'గా, సూర్య శ్రీనివాస్ 'పృథ్వి' అనే పాత్రలలో కనిపించనున్నారు. కమల్ కామరాజు, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి సీనియర్ నటులు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఎంత గ్యాప్ వచ్చినా సినిమాలోని కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండటంతో, తాము ఎదుర్కొన్న రిలీజ్ కష్టాలన్నింటినీ ఈ చిత్రం దాటుకుంటుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది.
రీసెంట్ గా హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. బీవీఎస్ రవి లాంటి వాళ్లు కూడా ఈ వేడుకలో పాల్గొని టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. ప్రమోషన్స్ తో స్పీడ్ పెంచిన చిత్రబృందం అన్ని అడ్డంకులు దాటుకుని సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతోంది. ఇక 'సీక్రెట్ సోల్జర్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
