టాప్ స్టోరి: ప్రతి కుక్కకు ఒక రోజొస్తుంది!
వయసు అయిపోయిందని కలత వలదు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఆర్టిస్టులకు అవకాశాలొస్తున్నాయి.
By: Sivaji Kontham | 8 Dec 2025 5:00 AM ISTవయసు అయిపోయిందని కలత వలదు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఆర్టిస్టులకు అవకాశాలొస్తున్నాయి. ప్రతిభను చాటాలే కానీ, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ, ఇప్పుడున్నన్ని అవకాశాలు ఒకప్పుడు లేనే లేవు. ఇటీవలి కాలంలో పెద్ద తెర, బుల్లితెరతో పాటు ఓటీటీలు కళాకారులు, సాంకేతిక నిపుణులకు భారీగా అవకాశాల్ని సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఒరవడిని అందిపుచ్చుకుని నటులుగా సత్తా చాటిన సీనియర్ హీరోల జాబితా ఏం ఉందో వెతికితే...
ఒక్క డియోల్ ఫ్యామిలీలోనే ఇద్దరు హీరోలు ఉన్నారు. ధర్మేంద్ర నటవారసులు సన్నీడియోల్, బాబి డియోల్ ఒకే సీజన్ లో గ్రేట్ కంబ్యాక్ అంటే ఏమిటో చూపించారు. ఈ ఇద్దరి కెరీర్ ఆల్మోస్ట్ ఖతమ్ అయిపోయిందన్న టాక్ నడిచింది. కొన్నేళ్ల పాటు అవకాశాల్లేక డీలా పడిపోయారు. పబ్లిక్ లో ముఖం చూపించేందుకు కూడా భయపడ్డానని అన్నాడు బాబి డియోల్. తన భార్య సంపాదన మీద ఆధారపడి జీవించానని కూడా నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి ఒకే ఒక్క `యానిమల్` ఆఫర్ అతడిని బయటపడేసింది. క్రూరుడైన అబ్రార్ పాత్రలో బాబి డియోల్ నట ప్రదర్శనకు గొప్ప గుర్తింపు దక్కింది. ఇప్పుడు అతడు బాలీవుడ్ సహా సౌత్ లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్. అదే సమయంలో గద్దర్ 2 గ్రాండ్ సక్సెస్ తో సన్నీడియోల్ కూడా తెరపైకి దూసుకొచ్చాడు. అతడు వరుస పెట్టి నాలుగైదు చిత్రాలకు సంతకాలు చేసాడు. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో జాత్ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సన్నీడియోల్, ఇప్పుడు అమీర్ ఖాన్ నిర్మిస్తున్నబార్డర్ 2 సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఉత్సాహంగా ఉన్నాడు. తదుపరి నితీష్ తివారీ రామాయణంలో సన్నీడియోల్ అత్యంత కీలకమైన ఆంజనేయుడి పాత్రలో నటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పుడు ఇదే కేటగిరీలో వెటరన్ స్టార్ వినోద్ ఖన్నా కుమారుడైన అక్షయ్ ఖన్నా కూడా గ్రేట్ కంబ్యాక్ అంటే ఏమిటో చూపిస్తున్నాడు. అక్షయ్ ఖన్నా గ్రేట్ పెర్ఫామర్. కానీ అతడికి ఉన్న బట్ట తల కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని బహిరంగంగా అంగీకరించాడు. అద్దంలో తన బట్ట తలను చూసుకుని కుంగి కుషించిపోయానని, కొన్నేళ్ల పాటు తనను ఇండస్ట్రీ దూరం పెట్టిందని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని ఆవేదన చెందాడు.
అయితే అతడికి కూడా ఒక టైమ్ వచ్చేసింది. ఈ ఏడాది వరుస పెట్టి అదిరిపోయే అవకాశాల్ని అందుకున్నాడు. ఇంతకుముందు బ్లాక్ బస్టర్ `చావా`లో ఔరంగజేబు పాత్ర అతడికి గొప్ప పేరు తెచ్చింది. క్రూరుడైన ఔరంగజేబు దారుణ మారణహోమం ఎలా ఉంటుందో చూపించే పాత్రలో అతడు ఎంతగా యాప్ట్ అయ్యాడంటే, అక్షయ్ ఖన్నా తప్ప ఇంకెవరు ఆ పాత్రలో అంతగా మెప్పించలేరు! అనేంతగా పేరు తెచ్చుకున్నాడు. అతడి డెడికేషన్ , అనుభవం, యూనిక్ నెస్ కట్టి పడేసాయి.
ఇప్పుడు రణ్ వీర్ సింగ్ తో పోటీపడుతూ దురంధర్ చిత్రంలోను అతడు పోషించిన రెహమాన్ బలోచ్ అనే పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. అతడు ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ప్రాధాన పాత్రధారులతో పోటీపడి నటించగల సమర్థుడు. ముఖ్యంగా భావోద్వేగాలను పండించడంలో, హావభావాలను రక్తి కట్టించడంలో మేటి నటుడిగా అతడు నిరూపించాడు. పాకిస్తానీ మాఫియా డాన్ పాత్రతో రణ్ వీర్ కి గట్టి పోటీనిచ్చాడు అక్షయ్.
షో స్టాపర్స్ అనిపించే ప్రదర్శనలతో మెప్పించారు కాబట్టే.. సన్నీడియోల్, బాబి డియోల్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్లు ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్నారు. దశాబ్ధం పైగానే ఖాళీగా గడిపిన వీళ్లంతా ఇప్పుడు బిజీ ఆర్టిస్టులుగా మారారు. తెలుగు చిత్రసీమలో హీరో నుంచి విలన్ గా మారిన జగపతిబాబు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత పెద్ద బిజీ ఆర్టిస్ట్ అయ్యారో తెలిసినదే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే...!! ప్రతి ఒక్కరికీ సహనం కావాలి. ఆ రోజు కోసం ఎదురు చూడాలి. అలాగే ఏలిన్నాటి శని కూడా వదిలిపోవాలి. అప్పుడే ఇలాంటి గ్రేట్ కంబ్యాక్ పాజిబుల్.
