Begin typing your search above and press return to search.

AI ఎఫెక్ట్: స్టార్ల వాయిస్‌ని కాపీ చేయ‌డం దొంగ‌త‌నంతో స‌మానం

తాజా సమాచారం ప్రకారం.. వీరు ఇద్దరూ కలిసి సుమారు 700 మంది కళాకారులు, రచయితలు, సృజనాత్మక క‌ళాకారుల‌తో కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు.

By:  Sivaji Kontham   |   24 Jan 2026 9:00 PM IST
AI ఎఫెక్ట్: స్టార్ల వాయిస్‌ని కాపీ చేయ‌డం దొంగ‌త‌నంతో స‌మానం
X

హాలీవుడ్ పాపుల‌ర్ తార‌లు స్కార్లెట్ జోహన్సన్, కేట్ బ్లాంచెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాంకేతికత పేరిట కళాకారుల హక్కులను కాలరాయడం సరికాదని వారు గట్టిగా వాదిస్తున్నారు.

దీనికి సంబంధించిన ముఖ్య కారణాలు, తాజా పరిణామాలు ప‌రిశీలిస్తే,... స్కార్లెట్ జోహన్సన్ గతంలో ఓపెన్ ఏఐ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాట్ జీపీటీ కోసం `స్కై` అనే వాయిస్‌ను రూపొందించినప్పుడు, అది తన గొంతును పోలి ఉందని ఆమె ఆరోపించారు. త‌న‌ గొంతును వాడుకోవడానికి ఓపెన్ ఏఐ సంస్థ‌ ప్రతిపాదనను స్కార్లెట్ ముందే తిరస్కరించారు. అయినా కూడా ఆమె గొంతును పోలిన వాయిస్‌ను వాడటంపై న్యాయపరమైన పోరాటానికి దిగారు. దీన్ని కేవలం కాపీరైట్ సమస్యగానే కాకుండా, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని దొంగిలించడంగా స్కార్లెట్ పరిగణిస్తున్నారు.

కేట్ బ్లాంచెట్ హెచ్చరిక...

రెండుసార్లు ఆస్కార్ గెలుచుకున్న కేట్ బ్లాంచెట్ కూడా కృత్రిమ మేథ‌పై తీవ్రమైన ఫిర్యాదు చేసారు. ఏఐ వల్ల కలిగే నష్టాలపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ మనుషుల గొంతులను, రూపాలను అనుకరించగలదు కానీ, మానవ అనుభూతులను, మరణంపై ఉండే భయాన్ని.. స‌మ‌యం విలువను అది ఎప్పటికీ అర్థం చేసుకోలేదని ఆమె అన్నారు. క్రియేటివిటీ పేరుతో చేసే ఇలాంటి ప్రయోగాలు సరిగ్గా నియంత్రించకపోతే, అవి సృజనాత్మక రంగానికి `విధ్వంసకరం`గా మారుతాయని కేట్ హెచ్చరించారు.

ఈ జనవరి 2026లో యాంటి ఏఐ క్యాంపెయిన్ స్టార్ట‌యింది. తాజా సమాచారం ప్రకారం.. వీరు ఇద్దరూ కలిసి సుమారు 700 మంది కళాకారులు, రచయితలు, సృజనాత్మక క‌ళాకారుల‌తో కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. అనుమతి లేకుండా కళాకారుల పనిని, గొంతును, రూపాన్ని ఏఐ ట్రైనింగ్ కోసం వాడుకోవడం `ఆవిష్కరణ` కాదు. అది `దొంగతనం` అని వారు స్పష్టం చేశారు. కాపీరైట్ చట్టాలను కఠినతరం చేయాలని, టెక్ కంపెనీలు కళాకారులకు తగిన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

హాలీవుడ్‌పైనా దీని ప్ర‌భావం..

అగ్ర తారల జోక్యం వల్ల హాలీవుడ్ స్టూడియోలు , టెక్ కంపెనీలు తమ ఏఐ విధానాలపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం నటులకే కాకుండా, రచయితలు, సంగీతకారులు, ఇతర సాంకేతిక నిపుణుల ఉపాధిని కాపాడటానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. హాలీవుడ్ కి మాత్ర‌మే కాదు, దీని ప్ర‌భావం భార‌తీయ చిత్ర‌సీమ‌పైనా, టాలీవుడ్ పైనా ప‌డ‌నుంద‌న్న ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.