దక్షిణాది స్టార్లు బాలీవుడ్ నటులతో పోలిస్తే మర్యాదస్తులు: షాయాజీ షిండే
ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిన గొప్ప గౌరవం అందుకున్న నటుడు షాయాజీ షిండే. అతడికి టాలీవుడ్ గొప్ప అవకాశాలు కల్పించింది.
By: Sivaji Kontham | 7 Oct 2025 1:00 AM ISTఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిన గొప్ప గౌరవం అందుకున్న నటుడు షాయాజీ షిండే. అతడికి టాలీవుడ్ గొప్ప అవకాశాలు కల్పించింది. ఇక్కడ ప్రముఖ దర్శకులు, హీరోలతో అతడికి సత్సంబంధాలున్నాయి. అతడి కెరీర్ బాలీవుడ్ లో కంటే, దక్షిణాదిన గొప్పగా వెలిగిపోయింది. ఇప్పుడు షాయాజీ షిండే తన అనుభవాలను ఓపెన్ మైండ్ తో వెల్లడించారు. ఉత్తరాది - దక్షిణాది పరిశ్రమల్లో స్టార్ల ప్రవర్తనా నియమావళి ఎలా ఉంటుందో షాయాజీ వెల్లడించారు.
బాలీవుడ్ నటులతో పోలిస్తే దక్షిణాది నటులు మర్యాదస్తులు అని ఆయన వ్యాఖ్యానించారు. తమ సహనటులను గౌరవించడంలో వారు ఎప్పుడూ ముందుంటారని, మర్యాదగా వ్యవహరిస్తారని అన్నారు. దక్షిణాదిన వినయం, గౌరవ ప్రదమైన ప్రవర్తన తనను ఎప్పుడూ ఆకర్షిస్తాయని కూడా షాయాజీ తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి 2002 చిత్రం `బాబా` చిత్రానికి పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైన ఒక అందమైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సెట్‌లో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు రజనీకాంత్ నన్ను గమనించి, బయట ఎందుకు కూర్చున్నారు? అని మర్యాదగా అడిగారు. చెట్టు నీడను తాను ఇష్టపడతానని చెప్పినప్పుడు, సూపర్ స్టార్ లోపలికి వచ్చి తన ఆహారాన్ని కూడా నాతో షేర్ చేసుకున్నారు. తరువాత రజనీకాంత్ కోసం తీసుకు వచ్చిన దానిమ్మ రసాన్ని సెట్లో ముందుగా షిండేకు ఇవ్వాలని రజనీ అభ్యర్థించారు. 2000 చిత్రం `భారతి`లో షిండే పోషించిన ముఖ్యమైన పాత్రను రజనీకాంత్ అందరికీ గుర్తు చేశారు! అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఆ అరుదైన క్షణం రజనీకాంత్ నాపై చూపిన దయను నేను ఎప్పటికీ మర్చిపోలేను! అని షిండే పేర్కొన్నారు. చాలా మంది బాలీవుడ్ తారలతో పోలిస్తే దక్షిణ భారత నటులు గౌరవం, వినయంలో గొప్పవారు అని ఆయన అన్నారు.
మహారాష్ట్రలోని ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సాయాజీ షిండే చాలా నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చారు. 1978లో మహారాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ మరాఠీ థియేటర్‌లో నటించడం ప్రారంభించారు. నెలకు రూ.165 తక్కువ జీతం సంపాదించారు. ఆరంభ పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. సినీపరిశ్రమలో కాకుండా స్టేజీ డ్రామా ఆర్టిస్టుగాను అతడు గొప్ప ఖ్యాతి ఘడించారు. జుల్వా (1987), వన్ రూమ్ కిచెన్ (1989), అమ్చ్యా యా ఘరత్ (1991) వంటి మరాఠీ ఏకపాత్ర నాటకాలతో థియేటర్ ఆర్టిస్టుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మరాఠీ సినిమాల్లో నటించి అటుపై బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల్లోను స్టార్ అయ్యారు. అతడు బహుభాషా జ్ఞాని. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, గుజరాతీ, భోజ్‌పురి చిత్రాలలో నటించడం వెనక అతడి భాషా నైపుణ్యం పెద్ద సహకారి అయింది.
