వాచ్ మెన్ ఉద్యోగం చేసిన ఫేమస్ విలన్!
సాయాజీ షిండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రతి నాయకుడి పాత్రలతో ఆడియన్స్ ను ఎంతగా మెప్పించాడో తెలిసిందే.
By: Srikanth Kontham | 7 Jan 2026 11:00 PM ISTసాయాజీ షిండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రతి నాయకుడి పాత్రలతో ఆడియన్స్ ను ఎంతగా మెప్పించాడో తెలిసిందే. 'ఠాగూరు'తో విలన్ గా పరిచయమైన సాయాజీ షిండే అనతి కాలంలోనే అగ్ర నటుడిగా ఎదిగాడు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ టర్నింగ్ తీసుకున్నారు. విలన్ అవకాశాలు తగ్గడం, కొత్త నటులు తెరపైకి రావడంతో సాయాజీ షిండేకి అవకాశాలు తగ్గిన క్రమంలో ఎలాంటి పాత్రలు వచ్చినా నో చెప్పకుండా పనిచేసారు.
'ఠాగూరు' 'పోకిరి', 'అతడు', 'రాఖీ','నేనింతే','కింగ్', 'అదుర్స్' లాంటి చిత్రాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అన్నింటిని మించి ఆయన వాయిస్ విషయంలో ఆరంభంలో విమర్శలొచ్చినా? కాలక్రమంలో అదే వాయిస్ అతడి కెరీర్ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడిందన్నది కాదనలేని నిజం. ముంబై నటుడైనా? స్థానిక భాషను నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సాధారణంగా ముంబై నటులంటే ప్రత్యామ్నాయంగా డబ్బింగ్ ఆర్టిస్టులపై ఆధార పడతారు. కానీ షియాజీ షిండే మాత్రం అన్నీ తానై పనిచేస్తారు.
దర్శక, రచయితలకు ఆ రకంగా వెసులు బాటుగానూ మారారు. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, భోజ్ పురీ, మరాఠీ, గుజరాతి భాషల్లోనూ స్టార్ నటుడిగా వెలుగొందుతున్నారు. ఇతడి జీవితం సైతం చాలా కష్టాల్లోనే కొనసాగింది. మహరాష్ట్రలో చిన్న గ్రామంలో పెరిగాడు. తండ్రి సాధారణ రైతు. చదువు కోసం చిన్న తనంలోనే సొంతూరును వదిలేసారు. పట్టణంలో చదువు అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో షియాజీ షిండే పగలు కాలేజీకి వెళ్లి రాత్రిపూట ఓ వాటర్ డ్యామ్ వద్ద వాచ్ మెన్ ఉద్యోగం చేసేవారు.
అందుకు గానూ నెల జీతం 165 రూపాయలు. అందులో 150 ఇంటికిచ్చి మిగిలిన 15 రూపాయలు తన ఖర్చలుగా ఉంచుకునేవారు. అదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకున్నారు. దీంతో చేతిలో ఉన్న కొద్ది డబ్బుతోనే ముంబై కి వెళ్లి వర్క్ షాప్స్ లో పాల్గొనేవారు. అనంతరం యాక్టింగ్ లో కొంత శిక్షణ కూడా పూర్తి చేసారు. నటుడైన తర్వాత సంపాదన పెరిగింది. నటుడు కాకముందు భోజనం కోసం కూడా ఇబ్బంది పడిన రోజులెన్నో ఉన్నాయి. కాలేజీ చదువుకునే వయసులోనే కుటుంబ బారం పడటంతో? తిని తనక జీవితాన్ని గడిపినట్లు గుర్తు చేసుకున్నారు. సాయాజీ షిండే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు.
