రామాయణంలో సాయి పల్లవి కంటే ముందున్న సీతమ్మలు!
చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాలకు, ముఖ్యంగా రామాయణ గాథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెరపై సీతాదేవి పాత్రలో నటించడం అంటే కేవలం నటన మాత్రమే కాదు.
By: Srikanth Kontham | 30 July 2026 12:26 PM ISTచలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాలకు, ముఖ్యంగా రామాయణ గాథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెరపై సీతాదేవి పాత్రలో నటించడం అంటే కేవలం నటన మాత్రమే కాదు. కోట్లాది మంది ప్రజల మనసుల్లో దైవత్వాన్ని నింపే పవిత్రమైన బాధ్యత అది. త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ గ్లోబల్ ప్రాజెక్ట్ `రామాయణం`లో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ తెరపై ఇంతకుముందు సీత పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొందరి ఐకానిక్ నటీమణుల గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి.
తెలుగు సినిమా చరిత్రలో పౌరాణిక పాత్రలంటే ముందుగా గుర్తువచ్చేది మహానటి సావిత్రి. ఆమె తన అద్భుతమైన అభినయంతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించినా? సీతాదేవి పాత్రకు సావిత్రి పోషించిన జీవం అసాధారణం. అప్పట్లో రిలీజ్ అయిన పౌరాణిక చిత్రాలలో సీత పాత్రలో సావిత్రి కనబరిచిన హావభావాలు, గంభీరత , ఎమోషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తెలుగు తెరపై సీతాదేవి అనగానే సావిత్రి రూపమే నేటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది. ఇది తదానంతరం వచ్చిన ఎందరో? నటీమణులకు గొప్ప మార్గదర్శకంగా నిలిచింది.
టాలీవుడ్ లో మరో సీతమ్మ అంటే? నటి జయప్రద. దర్శకరత్న బాపు దర్శకత్వంలో తెరకెక్కిన `సీతా కళ్యాణం` చిత్రంలో జయప్రద సీతాదేవిగా నటించి అపూర్వమైన కీర్తిని సంపాదించారు. ఆ చిత్రంలో జయప్రద అచ్చమైన దేవతలా కనిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ సినిమా విజయంలో ఆమె పాత్ర పోషించిన తీరు ఎంతో కీలకం. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ పౌరాణిక చిత్రంగా నిలిచిపోయిన ఆ సినిమాలో జయప్రద నటన మైలురాయిగా చెప్పుకొవచ్చు.
మరో దిగ్గజ నటి వాణిశ్రీ కూడా పౌరాణిక చిత్రాలలో తనదైన ముద్ర వేసారు. సీతాదేవి పాత్రకు అవసరమైన అంకితభావం, పవిత్రత ,రాచరికపు హుందాతనాన్ని తన నటన ద్వారా అద్భుతంగా పండించారు. పౌరాణిక పాత్రలు చేయడం అంత సులభం కాకపోయినా? నటీమణులు తమ అంకితభావంతో ఆ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు. నేటి తరానికి చెందిన నటీమణులకు ఆనాటి తారలు నటనలోనూ, సంప్రదాయబద్ధతలోనూ పాఠంగా నిలిచారు.
తర్వాత కాలంలో వచ్చిన మరికొంత మంది నటీమణులు కూడా ఇలాంటి పవిత్ర పాత్రలను పోషించి మెప్పించారు. నయనతార వంటి స్టార్ హీరోయిన్లు కూడా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలలో సీతాదేవిగా నటించి ప్రేక్షకు లను అలరించారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ తెరకెక్కుతున్న రామాయణ కథల్లో ఈ పాత్రల ప్రాముఖ్యత మరింత పెరిగింది. సౌత్ ఇండియన్ నటీమణులు గ్లోబల్ స్థాయిలో సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ పాత్రలకు జీవం పోయడం అభినందించదగ్గ విషయం.
ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ.. గ్లోబల్ ప్రాజెక్ట్ `రామాయణం`లో సీతాదేవి పాత్రను సాయి పల్లవి పోషిస్తుండటం విశేషం. తన సహజమైన నటనకు, అద్భుతమైన హావభావాలకు పేరుగాంచిన సాయి పల్లవి ఈ పాత్రలో ఏ విధంగా మెప్పిస్తారనే? దానిపై భారీ అంచనాలున్నాయి. సావిత్రి, జయప్రద లాంటి దిగ్గజాల సరసన సాయి పల్లవి కూడా సీతాదేవిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
