కంప్లీట్ కొత్త కాన్సెప్ట్ తో సత్యదేవ్.. ఈసారి హిట్ ట్రాక్ ఎక్కేస్తారా?
టాలీవుడ్ లో విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
By: M Prashanth | 22 May 2026 6:14 PM ISTటాలీవుడ్ లో విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ ఫార్ములాకు పరిమితం కాకుండా.. కథలో కొత్తదనం ఉంటే చాలు రిస్క్ తీసుకునే హీరోగా సత్యదేవ్ పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే జోనర్ లో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు.
ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి సమవర్తి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆరంభం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ నాగ్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ మూవీ.. ప్రకృతి, అడవులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను యాక్షన్ డ్రామాతో కలిపి చూపించనుంది.
ప్రస్తుతం సమాజంలో చెట్ల నరికివేత, అడవుల నాశనం, మూగజీవుల జీవన సమస్యలు వంటి విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. అలాంటి బ్యాక్ డ్రాప్ తో సినిమా రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. సత్యదేవ్ పూర్తిగా కొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. చుట్టూ కత్తులు, గొడ్డళ్లు పట్టుకున్న వ్యక్తులు ఉండగా.. చెవిలో హెడ్‌ఫోన్స్, నోట్లో బీడీతో చాలా కూల్ గా కనిపించిన ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సాధారణంగా సత్యదేవ్ ను సీరియస్, ఎమోషనల్ పాత్రల్లో ఎక్కువగా చూసిన ప్రేక్షకులకు.. సమవర్తి మూవీ మాస్ యాక్షన్ టచ్ కొత్త అనుభూతిని ఇవ్వనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా పోస్టర్ లో కనిపించిన ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ చూస్తే.. ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నారని అర్థమవుతోంది. అయితే సమవర్తి అనే టైటిల్ కూ ప్రత్యేకమైన అర్థం ఉంది. పురాణాల్లో యమధర్మరాజును సమవర్తి అని పిలుస్తారు. అంటే ఎవరికీ పక్షపాతం లేకుండా సమానంగా తీర్పు చెప్పేవాడు అనే భావన. అదే థీమ్ ను సినిమాలోనూ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో హీరో పాత్ర న్యాయం కోసం పోరాడే విధంగా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ రెడ్డి, శివ చరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమల్లి అందిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న రావు బహదూర్ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. ఇప్పుడు సమవర్తితో సత్యదేవ్ మరోసారి తన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సత్యదేవ్ కు గతంలో ప్రశంసలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఈసారి కొత్త కాన్సెప్ట్, మాస్ యాక్షన్, పర్యావరణ అంశాలు కలిసి ఆయనకు సరైన కమర్షియల్ హిట్ తీసుకువస్తాయా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
