సత్యదేవ్ ను తీసేయమన్న RGV.. కానీ ట్విస్ట్ ఏంటంటే?
టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్నారు.
By: M Prashanth | 31 May 2026 1:00 PM ISTటాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్నారు. కంటెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే యాక్టర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుతం సత్యదేవ్ లీడ్ రోల్ లో నటించిన సమవర్తి విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తన సినీ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సత్యదేవ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన చిత్రాల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మి ఒకటి. ఆ సినిమాలో ఆయన లీడ్ రోల్ లో నటించారు. అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఓ సంఘటనను సత్యదేవ్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జరిగిన విషయం తనను ఎంతగానో బాధపెట్టిందని తెలిపారు.
సత్యదేవ్ చెప్పిన వివరాల ప్రకారం, జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక పాటను దర్శకుడు పూరీ జగన్నాథ్ కొంతమందికి చూపించారట. ఆ వీడియో చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా మొత్తం బాగానే ఉన్నప్పటికీ హీరో మాత్రం సూట్ అవ్వలేదని అభిప్రాయపడ్డారట. అంతేకాదు, హీరోను మార్చాలని, అవసరమైతే రీషూట్ చేయాలని కూడా సూచించారట. లేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందని అంచనా వేశారట.
ఆ విషయం తర్వాత తనకు తెలిసినప్పుడు చాలా బాధ కలిగిందని సత్యదేవ్ వెల్లడించారు. కేవలం ఒక పాట చూసి ఎలా నిర్ణయం తీసుకుంటారని తాను ఆలోచించానన్నారు. సినిమా మొత్తం చూడకుండా తన గురించి ఇలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందని కూడా చెప్పారు. అయితే కథ అక్కడితో ముగియలేదు. జ్యోతిలక్ష్మి పూర్తి సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందట.
సినిమా స్పెషల్ స్క్రీనింగ్ రోజు అందరూ వెళ్ళిపోయాక తనను పిలిపించుకుని మాట్లాడారని సత్యదేవ్ తెలిపారు. "నిన్ను తీసేయమని చెప్పడం పెద్ద తప్పు. రీషూట్ చేయమన్నాను. అది నా పొరపాటు. నువ్వు అద్భుతంగా నటించావు. సారీ" అని వర్మ స్వయంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకసారి అభిప్రాయం చెప్పిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.
అలాంటిది తన తప్పును ఒప్పుకుని మాట్లాడడం ఆర్జీవీ పర్సనాలిటీ చూపించిందని సత్యదేవ్ అభిప్రాయపడ్డారు. ఆ విషయం తనకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే తన ఫోన్ లో అనేక మిస్డ్ కాల్స్ కనిపించాయట. రామ్ గోపాల్ వర్మ తన గురించి సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారని అనేక మంది ఫ్రెండ్స్ చూసి చెప్పారని సత్యదేవ్ వెల్లడించారు.
మొదట తనను మార్చేయాలని చెప్పిన వ్యక్తే తర్వాత తన యాక్టింగ్ ను మెచ్చుకోవడం సినీ కెరీర్ లో రేర్ గా జరిగే ఇన్సిడెంట్ గా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ చెప్పిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలెంట్ ఉంటే విమర్శలు కూడా ప్రశంసలుగా మారుతాయని అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు రిజెక్ట్ చేయాలన్న వ్యక్తి నుంచి ప్రశంసలు అందుకోవడం గ్రేట్ అని కూడా అంటున్నారు.
