Begin typing your search above and press return to search.

పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకున్న స‌త్య‌దేవ్‌!

సినిమా ఇండ‌స్ట్రీలో చిత్ర విచిత్రాలు జ‌రుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హీరోకు వెళ్ల‌డం..మ‌రో హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం జ‌రుగుతుంటుంది.

By:  Ravindar Gorantla   |   25 March 2026 12:01 PM IST
పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకున్న స‌త్య‌దేవ్‌!
X

సినిమా ఇండ‌స్ట్రీలో చిత్ర విచిత్రాలు జ‌రుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హీరోకు వెళ్ల‌డం..మ‌రో హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం జ‌రుగుతుంటుంది. ఇదే త‌ర‌హాలో ఒక మూవీతో ప‌రిచ‌యం కావాల‌నుకున్న వాళ్లు మ‌రో మూవీతో అరంగేట్రం చేసిన సంద‌ర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే టాలెంటెడ్ హీరో స‌త్య‌దేవ్ మాత్రం ఎక్క‌డ పోగొట్టుకున్నాడో అక్క‌డే రాబ‌ట్టుకోవ‌డం విశేషం. ఈ విష‌యాన్ని యూత్ మూవీ ఈవెంట్‌లో హీరో స‌త్య‌దేవ్ ఇండైరెక్ట్‌గా వెల్ల‌డించారు.

కెన్ కురుణాస్ హీరోగా న‌టించి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `యూత్‌`. త‌మిళంలో ఇప్ప‌టికే విడుద‌లై సూప‌ర్ హిట్ అనిపించుకున్న ఈ మూవీని తెలుగులో ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 26న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌విష్ణు, ద‌ర్శ‌కులు హ‌సిత్ గోలి, సాయి రాజేష్‌ల‌తో పాటు హీరో స‌త్య‌దేవ్ కూడా పాల్గొన్నారు.

అయితే కాన్సెప్ట్ ప్ర‌కారం ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌ని మొద‌టి నుంచి ప్లాన్ చేస్తున్న `యూత్` టీమ్ ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిథుల‌కు సంబంధించిన పాత ఫొటోల‌ని ప్ర‌ద‌ర్శించింది. ఇందులో హీరో స‌త్య‌దేవ్‌కు సంబంధించిన పాత ఫొటోల‌ని ప్ర‌ద‌ర్శించి ఇవి ఎప్పుడు? ఎందుకోసం దిగారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో స‌త్య‌దేవ్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాను `ప‌య‌నం` సినిమా కోసం విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నాన‌న్నారు.

ఆ మూవీతోనే న‌టుడిగా త‌న ప్ర‌యాణం ప్రారంభం అవుతుంద‌ని అనుకున్నాన‌ని, అయితే అది కుద‌ర‌క‌పోవ‌డంతో దాని గుర్తుగా ఫొటోలు మాత్రం మిగిలాయ‌న్నారు. `ప‌యనం`ని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తే త‌మిళంలో ప్ర‌కాష్ రాజ్ నిర్మించారు. కింగ్ నాగార్జున, ప్ర‌కాష్ రాజ్‌, పూన‌మ్ కౌర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఫ్లైట్ హైజాక్ నేప‌థ్యంలో రూపొంది రెండు భాష‌ల్లోనూ సూప‌ర్ హిట్ అనిపించుకుంది.

ఈ సినిమాతో న‌టుడిగా కెరీర్‌ని ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నాలు చేసిన స‌త్య‌దేవ్ ఈ మూవీని నిర్మించిన దిల్ రాజు సినిమాతోనేఆర్టిస్ట్‌గా త‌న ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్ట‌డం విశేషం. 2011లో ప్ర‌భాస్ హీరోగా దిల్ రాజు నిర్మించిన మూవీ `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌`. ద‌శ‌ర‌త్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో స‌త్య‌దేవ్ న‌టుడిగా కెరీర్ ప్రారంభించారు. దిల్ రాజు నిర్మించిన `ప‌య‌నం`లో ఛాన్స్ మిస్స‌యినా మ‌ళ్లీ అదే నిర్మాత ప్రొడ్యూస్ చేసిన `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌`తో అరంగేట్రం చేయ‌డం గ‌మ‌నార్హం. స‌త్య‌దేవ్ ప్ర‌స్తుతం `రావు బ‌హ‌దూర్‌`, ఫుల్ బాటిల్‌,`గ‌రుడ చాప్ట‌ర్ 1` చిత్రాల్లో న‌టిస్తున్నాడు.