సత్యదేవ్ కెరీర్లో మర్చిపోలేని గాయం
టాలెంట్ ఉన్నా సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న హీరో సత్యదేవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
By: Sravani Lakshmi Srungarapu | 31 May 2026 11:00 PM ISTటాలెంట్ ఉన్నా సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న హీరో సత్యదేవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2024లో రిలీజైన కృష్ణమ్మ సినిమా గురించి మాట్లాడిన ఆయన, ఆ సినిమాను థియేటర్లలో నిలబెట్టే అవకాశం కూడా దక్కలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృష్ణమ్మ మూవీ థియేటర్లలో రిలీజైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేయడం తనకు కూడా షాక్ ఇచ్చిందని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఒక సినిమా ఓటీటీ డీల్, ఓటీటీ రిలీజ్ డేట్స్ గురించి హీరోలకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అయితే కృష్ణమ్మ విషయంలో తాను థియేటర్లలో సినిమా ప్రమోట్ చేస్తూ ఉండగానే ఓటీటీలో రిలీజైందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని సత్యదేవ్ చెప్పడం కమ్యూనికేషన్ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూషన్ టీమ్, హీరో మధ్య సమన్వయం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
సత్యదేవ్ వ్యాఖ్యల్లో మరో కీలక అంశం 2024 ఎలక్షన్స్ ఎఫెక్ట్. ఆ టైమ్ లో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొనగా, అందరి దృష్టి పెద్దఎత్తున రాజకీయాలపైనే ఉందని, అలాంటి టైమ్ లో రిలీజైన కృష్ణమ్మకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవానికి కథా బలం, ఎమోషన్స్, నటీనటుల ప్రదర్శన పరంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఎన్నికల హీట్ కారణంగా ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో రాలేకపోయారని సినీ విశ్లేషకులు కూడా అప్పట్లో అభిప్రాయపడ్డారు. సత్యదేవ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, సినిమాకు మొదట్లో రెస్పాన్స్ పరిమితంగా ఉన్నా నెమ్మదిగా సినిమా గురించి పాజిటివ్ టాక్ పెరుగుతోందని, ఆడియన్స్ థియేటర్లకు రావడం మొదలుపడుతున్న టైమ్ లోనే ఓటీటీ రిలీజ్ జరిగిపోయిందని వెల్లడించారు. దీంతో థియేట్రికల్ రన్‌కు అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు.
అయితే ఈ వ్యవహారం మరో పెద్ద చర్చకు కూడా తెరలేపింది. అదే తెలుగు సినిమాల్లో తగ్గిపోతున్న థియేట్రికల్ విండో. ఒకప్పుడు సినిమా రిలీజైన తర్వాత నెలలు గడిచాకే టెలివిజన్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు చేరేది. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు వారం, పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కృష్ణమ్మ విషయంలో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే డిజిటల్ రిలీజ్ జరగడం ఈ ట్రెండ్‌కు అత్యంత స్పష్టమైన ఉదాహరణగా మారింది. తనకు ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తెలియక సినిమాను ప్రమోట్ చేస్తున్న టైమ్ లో ఓ నెటిజన్ ఆల్రెడీ సినిమా ఓటీటీలోకి వస్తున్నప్పుడు థియేటర్ కు ఎందుకెళ్లాలని ప్రశ్నించాడని, అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందని, కృష్ణమ్మ సినిమా తనకు హార్ట్ బ్రేక్ ను ఇచ్చిందని సత్యదేవ్ చెప్పారు.
