ఎవరు ఏది చేయాలో ముందే రాసి పెట్టి ఉంటుంది
కొంతమంది మొహమాటం వల్లో లేక ఎదుటివారు బాధ పడతారనే కారణం చేతనో అంత తొందరగా నో చెప్పలేరు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Aug 2025 11:10 AM ISTకొంతమంది మొహమాటం వల్లో లేక ఎదుటివారు బాధ పడతారనే కారణం చేతనో అంత తొందరగా నో చెప్పలేరు. ఒక్కసారి నో చెప్పలేకపోవడం వల్ల తర్వాత ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని వల్ల అనుకోకుండా చాలా సమస్యలు కూడా వస్తాయి. అవన్నీ తెలిసినప్పటికీ నో చెప్పలేరు. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఈ విషయంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారట.
అందులో ఫెయిల్యూర్‌నే..
నటుడిగా తాను సక్సెస్ అయనప్పటికీ ఎదుటివారికి నో చెప్పడంలో మాత్రం తాను ఫెయిల్యూర్‌నే అంటున్నారు సత్యదేవ్. ఎదుటివారు బాధించకుండా నో చెప్పడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారట. తాను సినిమాలు చేస్తుంది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదని, డబ్బే ప్రాధాన్యత అయితే పొలం పని చేసుకుంటా కానీ సినిమాలు చేయనని సత్యదేవ్ చెప్తున్నారు.
నమ్మకం నిజమైంది
కింగ్‌డమ్ సినిమా కూడా అలానే చేశానని, డైరెక్టర్ తనకు కథ చెప్పగానే ఎలాంటి లెక్కలేసుకోకుండా వెంటనే ఓకే చేశానని, కింగ్‌డమ్ కథ విపరీతంగా నచ్చిందని ఆ కారణంతోనే వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు సత్యదేవ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. కథపై తాను పెట్టుకున్న నమ్మకమే నిజమైందని ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతుందన్నారు.
వేరే వారితో చేద్దామనుకున్నారు
తినే ప్రతీ మెతుకు మీదా పేరు రాసి ఉంటుందని, దానిపై ఎవరి పేరు రాసి ఉంటే వారే తింటారన్నట్టు, సినిమా పాత్రల విషయంలో కూడా అంతే జరుగుతుందని, ఏ పాత్ర ఎవరు చేయాలనేది కూడా ముందే రాసి పెట్టి ఉంటుందేమోనని అన్నారు. కింగ్‌డమ్ లో శివ క్యారెక్టర్ గౌతమ్ ముందు తనను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నప్పటికీ తర్వాత ఏవో రీజన్స్ వల్ల వేరే వారితో చేద్దామనుకున్నారనట. కానీ షూటింగ్ కు కొన్నాళ్ల ముందు డైరెక్టర్ తనను కలిసి కథ చెప్పారని, అందులోని తన పాత్రను డిజైన్ చేసిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పినట్టు సత్యదేవ్ చెప్పారు.
సవాలుగా అనిపించింది
సినిమాలో ఓ రెండు సీన్స్ చాలా ఛాలెంజింగ్ గా అనిపించాయని, ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డానని, కానీ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూశాక ఆ కష్టాన్నంతా మర్చిపోయానని చెప్పారు సత్యదేవ్. మూవీలో బోట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డామని, తనకు బోట్ నడపడం రాకపోయినా విజయ్ తనను నమ్మి బోట్ లో కూర్చున్నారని, బాగా ప్రాక్టీస్ చేసి బోట్ నడిపినప్పటికీ ఓ సారి చెట్ట కొమ్మల్లోకి వెళ్లబోయామని, మరోసారి చెట్టు మీద పడబోయిందని, కానీ ఆ ప్రమాదాల నుంచి బయటపడ్డామని సత్యదేవ్ తెలిపారు.
