10 ఏళ్ల స్ట్రగుల్.. ఎవరికి తెలియని విషయాలు బయటపెట్టిన సత్యదేవ్!
టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయినా, లక్ కలిసిరాకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలబడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
By: Madhu Reddy | 24 Jun 2026 12:34 PM ISTటాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయినా, లక్ కలిసిరాకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలబడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న స్థాయి నుంచి ఎదిగి, వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. తాజాగా ఆయన నటించిన 'రావు బహదూర్' సినిమా జూలై 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో సత్యదేవ్ తన 10 ఏళ్ల కెరీర్ స్ట్రగుల్స్, హిట్లు రాకపోవడానికి గల కారణాల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ సూటి ప్రశ్న:
ఇంటర్వ్యూలో యాంకర్ సత్యదేవ్‌ను ఒక సూటి ప్రశ్న అడిగారు. "మీరు బ్రిలియంట్ యాక్టర్ అని అందరికీ తెలుసు. కానీ మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న 'తిమ్మరుసు', అలాగే బాగా నటించిన 'కృష్ణమ్మ' సినిమాలు ఎందుకు అనుకున్నంతగా ఆడలేదు? పదేళ్లుగా సరైన కమర్షియల్ హిట్ లేకపోవడానికి కారణం ఏంటి?" అని అడగ్గా... సత్యదేవ్ ఎంతో ఎమోషనల్‌గా స్పందించారు. "అందరిలాగే నా కెరీర్ కూడా కాస్త స్లో అయ్యింది. దీనికి ప్రత్యేకంగా పెద్ద కారణాలు ఏవీ లేవు. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు... ఆడతాయి అనుకున్నవి ఆడలేదు, జరుగుతాయి అనుకున్నవి జరగలేదు" అంటూ తన ఆవేదనను పంచుకున్నారు.
పోరాటం ఆపలేదు.. గట్టిగా నిలబడ్డా:
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలబడటమే పెద్ద టాస్క్ అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఇక కంటెంట్ పరంగా అన్ని సినిమాలు బాగున్నా, ఎక్కడో ఏదో లోపం వల్ల సక్సెస్ దూరమైందని, ఈ పదేళ్ల ప్రయాణంలో ఎంతో స్ట్రగుల్ అయ్యానని తెలిపారు. అయితే, ఎప్పుడూ అధైర్యపడకుండా "మనం స్ట్రాంగ్‌గా నిలబడి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి" అనే ఒకే ఒక్క నమ్మకంతో ఫైట్ చేస్తూ ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
'రావు బహదూర్'పైనే అందరి చూపు:
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రావు బహదూర్'పై ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఇక జూలై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సత్యదేవ్ పడుతున్న కష్టానికి, ఆయన నమ్ముకున్న సినిమా రంగానికి ఒక గట్టి సమాధానంలా మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
సక్సెస్ అనేది లేకపోయినా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలనే సత్యదేవ్ మైండ్‌సెట్ నిజంగా స్ఫూర్తిదాయకం. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక నటుడిగా ఆయన ప్రతిభను ఎవరూ శంకించలేరు. మరి ఈ జూలై 3న రాబోతున్న 'రావు బహదూర్' చిత్రంతో సత్యదేవ్ కమర్షియల్ హిట్ ట్రాక్ ఎక్కి, తన పదేళ్ల నిరీక్షణకు తెరదించుతారో లేదో చూడాలి. ఆల్ ది బెస్ట్ సత్యదేవ్..
