తండ్రిగా నటించడం ఇష్టముండదు
వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా త్రిబాణధారి బార్బరిక్.
By: Sravani Lakshmi Srungarapu | 5 Aug 2025 5:45 PM ISTవర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా త్రిబాణధారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మారుతి సమర్పణలో తెరకెక్కగా విజయ్ పాల్ రెడ్డి నిర్మించారు. ఘటోత్కచుడి కొడుకైన బార్బరకుడి కథతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
75 సినిమాల్లో విలన్ గా
ఆగస్ట్ 22 న ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిత్రంలోని ప్రధాన తారాగణమంతా హాజరయ్యారు. ఇన్నేళ్ల తన కెరీర్లో 75 కి పైగా సినిమాల్లో విలన్ గా నటించానని చెప్పిన సత్యరాజ్ నటీనటులంతా ఈ సినిమాలోని పాత్రల్లాంటివే చేయాలనుకుంటారని చెప్పారు.
అలాంటి పాత్రలే రావాలనుకుంటా
అమితాబ్ సినిమాల్లో ముఖ్యంగా చీనీ కమ్, పింక్ లాంటి సినిమాల్లో నటించడమంటే ఇష్టమని చెప్పిన సత్యరాజ్, హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపించడం తనకు అసలు ఇష్టముండదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో చేసిన పాత్రలే ఎక్కువగా రావాలని తాను కోరుకుంటానని, మామూలుగా తాను ఏ సినిమా చేసినా తన పోర్షన్ షూటింగ్ అవగానే తన సీన్స్ వరకు చూసేస్తానని, కానీ ఈ సినిమా పూర్తైందని చెప్పగానే మొత్తం సినిమా చూపించమని అడిగినట్టు ఆయన తెలిపారు.
మెగాస్టార్ కంప్లీట్ యాక్టర్
మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ యాక్టర్ అని, ఎలాంటి సీన్ లోనైనా, ఎలాంటి సినిమానైనా ఆయన చాలా అద్భుతంగా చేయగలరిన ఆయన పుట్టినరోజు నాడు తమ సినిమా రిలీజ్ కానుండటం ఎంతో ఆనందంగా ఉందని సత్యరాజ్ తెలిపారు. ఈ సినిమాలో సత్యం రాజేష్, ఉదయభాను, సాంచి రాయ్, వశిష్ట ఎన్. సింహా కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాలోని తన క్యారెక్టర్ నటిగా తనకు మంచి సంతృప్తినిచ్చిందని ఉదయభాను చెప్పారు.
ఆయనతో నటించడం గర్వంగా ఉంది
పౌరాణిక పాత్ర నేటి జెనరేషన్ లోకి వస్తే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశమని, ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టమని, అయినా డైరెక్టర్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారని, ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు తాను గర్వపడుతున్నానని, సత్యరాజ్ లాంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఉదయభాను పేర్కొన్నారు.
