Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ 'సత్యదేవ్'.. ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా..

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్.. వైవిధ్యమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Feb 2026 11:13 PM IST
టాలెంటెడ్ సత్యదేవ్.. ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా..
X

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్.. వైవిధ్యమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ సినిమాలతో మెప్పించిన ఆయన.. తాజాగా కొత్త మూవీ స్టార్ట్ చేశారు. లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.

హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోస్ లో బుధవారం పూజా కార్యక్రమాలతో సత్యదేవ్ కెరీర్ లో 15వ మూవీ ప్రారంభమైంది. ఆ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై తొలి షాట్‌ కు క్లాప్ కొట్టారు. నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మేకర్స్ ఆ ప్రాజెక్ట్‌ ను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. సత్యదేవ్‌ కు జోడీగా యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు.

సంగీత దర్శకుడిగా సింగర్ రామ్ మిరియాల.. సత్య దేవ్ కొత్త సినిమాతో పూర్తిస్థాయిలో పరిచయం అవుతుండటం విశేషం. అయితే ఏ ఫన్ బ్లాస్ట్ అంటూ చిత్రం కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పూజా కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు సీరియస్, ఇంటెన్స్ పాత్రల్లో మెప్పించిన సత్యదేవ్ ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా కొత్తగా కనిపించనున్నారని సమాచారం.

ఇక సత్యదేవ్ కెరీర్ విషయానికి వస్తే… చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెల్లగా హీరోగా ఎదిగారు. ముకుంద, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో కనిపించిన ఆయన, తర్వాత జ్యోతిలక్ష్మి మూవీతో గుర్తింపు పొందారు. అక్కడి నుంచి హీరోగా మారి వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు.

హీరోగానే కాకుండా విలన్ గానూ తన టాలెంట్ తో మెప్పించారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలో చేసిన నెగిటివ్ రోల్‌ కు మంచి ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్‌ తో కలిసి నటించిన ఆ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక వాయిస్ యాక్టింగ్‌ లో కూడా తన ముద్ర వేశారు. హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్ లో కీలక పాత్రకు వాయిస్ ఇచ్చి అందరినీ అలరించారు.

రీసెంట్ గా కింగ్‌ డమ్ లో కూడా ముఖ్య పాత్రలో మెప్పించారు. ఇలా ప్రతి సినిమాలో ఫ్రెష్ నెస్ చూపిస్తూ ముందుకు సాగుతున్న సత్యదేవ్, ఇప్పుడు తన 15వ సినిమాతో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. మంచి కథ, స్ట్రాంగ్ టీమ్‌ తో రూపొందుతున్న ఆ మూవీ ఆయన కెరీర్‌ లో మరొక మైల్ స్టోన్ గా నిలిచే అవకాశం ఉందని సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.