జెట్లీ బరువైన బాధ్యత.. సత్య మోయాల్సిందే!
నిజానికి సత్య కెరీర్ లో ఇదొక పెద్ద రిస్క్ అని చెప్పాలి. కమెడియన్‌గా ఒత్తిడి లేకుండా సాగిపోతున్న తరుణంలో, హీరోగా మారి సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత వహించడం మామూలు విషయం కాదు.
By: M Prashanth | 23 April 2026 12:29 PM ISTటాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య ఇప్పుడు ‘జెట్లీ’ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాధారణంగా కమెడియన్‌గా ఉన్నప్పుడు కేవలం కొన్ని సీన్లతో మెప్పించే సత్య, ఇప్పుడు సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయాల్సిన బాధ్యతను తీసుకున్నారు. హీరోగా మారిన తర్వాత సినిమాకు కావాల్సిన క్రేజ్ తీసుకురావడంలో ప్రమోషన్లు ఎంత కీలకమో ఆయనకు బాగా తెలుసు. అందుకే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించారు. సత్య చేసిన ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మొదట తను రాసుకున్న స్పీచ్ పేపర్ చదువుతూ.. హీరోయిన్ రియాకు తెలుగు నేర్పిస్తానని చెప్పి, అన్నంలో ఆవకాయ, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలో నేర్పించి టైమ్ పాస్ చేశానని సరదాగా చెప్పుకొచ్చారు. అలాగే వెన్నెల కిషోర్, అజయ్ లాంటి కో స్టార్స్ తన కోసం సెట్లో వెయిట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారని జోక్ చేశారు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ తను లేని సీన్లను బాగా ఎంజాయ్ చేశారని, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ అయితే సత్య యాక్టింగ్‌తోనే అంతా వాయించేస్తున్నాడు కదా అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడని సత్య పేల్చిన పంచులు ఆడియన్స్‌ను అలరించాయి.
నిజానికి సత్య కెరీర్ లో ఇదొక పెద్ద రిస్క్ అని చెప్పాలి. కమెడియన్‌గా ఒత్తిడి లేకుండా సాగిపోతున్న తరుణంలో, హీరోగా మారి సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత వహించడం మామూలు విషయం కాదు. అందుకే ఈవెంట్‌లో కూడా తనే దగ్గరుండి అందరినీ పలకరిస్తూ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఫైట్ మాస్టర్ అంజితో జరిగిన గొడవల గురించి, స్టైలిస్ట్ తేజను తాను సన్నబడతానని చెప్పి మోసం చేయడం గురించి ఆయన చెప్పిన విషయాలు నవ్వులు పూయించాయి. ఇలాంటి ఫన్నీ ప్రమోషన్ల వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి మొదలవుతుంది.
దర్శకుడు రితేష్ రాణా తన వల్లే పైకి వచ్చాడని తాను ఫీల్ అవుతుంటానని, కానీ అసలు విషయం ఎవరికైనా తెలుస్తుందని సెటైర్ వేస్తూనే సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సత్య చేసిన యాక్షన్ మరియు డ్యాన్స్ కూడా హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమాను జనాలకు దగ్గరగా తీసుకెళ్లడంలో సత్య చూపిస్తున్న ఈ చొరవ బాక్సాఫీస్ వద్ద కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మే 1న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, ఈ స్పీచ్ తో సినిమాకు మంచి మైలేజ్ దక్కింది.
చివరగా, సత్య హీరోగా మారినా తనలోని కామెడీ యాంగిల్ ను మాత్రం అస్సలు వదలలేదు. ఆయన వేసిన గెటప్, ఈవెంట్ లో ఆయన చూపించిన ఎనర్జీ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. మత్తు వదలరా టీమ్ అంతా మళ్ళీ ఈ సినిమా కోసం కలిసి పని చేయడం మరో విశేషం. మరి ఈ ప్రయోగం సత్య కెరీర్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. కేవలం సత్య కామెడీ కోసమే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ ను ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
