ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!
'ఆకాశంలో ఒక తార' సినిమాతో పరిచయమైన సాత్విక వీరవల్లిలో మంచి గాయని కూడా ఉందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడైంది. 'మహానటి' సినిమాలోని 'సదా నన్ను' పాటను ఆమె చక్కగా పాడారు. గతంలో కర్ణాటక సంగీతం, భరతనాట్యంలో శిక్షణ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న సాత్వికకు భవిష్యత్తులో గాయనిగా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
By: M Prashanth | 25 Nov 2026 11:34 AM ISTతెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు చాలామందే వస్తుంటారు. కానీ అందరికీ ఎక్కువకాలం అవకాశాలు దక్కడం లేదు. అలాంటప్పుడు యాక్టింగ్‌తో పాటు మరో టాలెంట్ ఉంటే అదనపు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఆకాశంలో ఒక తార సినిమాతో పరిచయమైన సాత్విక వీరవల్లి విషయంలో కూడా ఇదే అనిపిస్తోంది. ఇటీవల ఇంటర్వ్యూలో అమ్మడు పాట పాడిన వీడియో చూస్తే హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా ప్రయత్నించే అవకాశం ఉందనిపిస్తోంది.
మహానటి సినిమాలోని సదా నన్ను పాటను సాత్విక చాలా చక్కగా పాడారు. ముఖ్యంగా పాట మధ్యలో రాగాలు తీసిన విధానం ఆకట్టుకుంది. నార్మల్ గా ఇంటర్వ్యూల్లో హీరోయిన్లు సరదాగా పాటలు పాడటం చూస్తుంటాం. కానీ సాత్విక పాడిన తీరు మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉంది. ఆమె గతంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నట్లు కూడా చెప్పారు. అందుకే రాగాలను అంత ఈజీగా పలికించగలిగారేమో అనిపిస్తోంది.
నిజానికి నటనతో పాటు పాటలు పాడిన హీరోయిన్లు ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. గతంలో మమతా మోహన్‌దాస్ తెలుగులో పలు సినిమాలకు పాటలు పాడారు. నిత్యా మీనన్ కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తన గాత్రాన్ని వినిపించారు. శ్రుతి హాసన్ అయితే మ్యూజిక్‌లోనూ ప్రత్యేకమైన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సాత్విక వాయిస్ వింటుంటే భవిష్యత్తులో ఆమె కూడా అలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కలుగుతోంది.
అయితే ఇంటర్వ్యూలో పాట పాడటం వేరు, సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా పాడటం వేరు. మ్యూజిక్ డైరెక్టర్ కోరుకున్నట్లు పాటను రికార్డ్ చేయడం, సినిమాలోని సన్నివేశానికి తగినట్లు వాయిస్ ఇవ్వడం కూడా ముఖ్యం. సాత్వికకు క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ ఉండటం మాత్రం ఉపయోగపడొచ్చు. ముఖ్యంగా మెలోడీ పాటలకు ఆమె గొంతు బాగా సరిపోతుందనిపిస్తోంది. సరైన అవకాశం వస్తే హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ గుర్తింపు తెచ్చుకునే ఛాన్స్ ఉంది.
మరోవైపు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కొత్త హీరోయిన్లకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే మొదటి సినిమా తర్వాత కూడా అదే క్రేజ్ కొనసాగించడం అంత ఈజీ కాదు. అందుకే కొందరు హీరోయిన్లు యాక్టింగ్‌తో పాటు ఇతర టాలెంట్స్‌ను కూడా బయటపెడుతున్నారు. సాత్వికకు సంగీతంతో పాటు భరతనాట్యంలోనూ శిక్షణ ఉంది. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల పాటలు, డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఆమెకు అదనపు ఉపయోగం ఉండొచ్చు.
ఇక సాత్విక నటించిన ఆకాశంలో ఒక తార నవంబర్ 20న విడుదలైంది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేసిన సాత్విక యాక్టింగ్ కోసం ఇండియాకు వచ్చినట్లు గతంలో చెప్పారు. ప్రస్తుతం తమిళంలో ఒక ప్రాజెక్ట్‌తో పాటు తెలుగులోనూ మరో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే సినిమాల్లో ఇప్పటివరకు పాటలు పాడింది లేదు. ఇక భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
