బాహుబలి, బార్బరిక్‌కు ఒకేలా ఇవ్వరుగా
పారితోషికం విషయంలో తాను గతంలో చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యానని, కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో అసలు వెనుకడుగేసే ప్రసక్తే లేదంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 19 Aug 2025 1:00 AM ISTకొందరు రెమ్యూనరేషన్ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తే మరికొందరు మాత్రం సినిమాలనైనా వదులుకుంటాం కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. ఒకప్పుడు తాను రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకునే వాడిని కాదని, తాను హీరోగా నటించిన సినిమాలు రిలీజవడానికి కొన్నిసార్లు అప్పులు కూడా చేసినట్టు సత్యరాజ్ చెప్పారు.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సత్యరాజ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా రెమ్యూనరేషన్ కు సంబంధించిన ప్రశ్న సత్యరాజ్ కు ఎదురవగా ఆయన చెప్పిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
రిలీజుల కోసం అప్పులు చేశా..
పారితోషికం విషయంలో తాను గతంలో చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యానని, కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో అసలు వెనుకడుగేసే ప్రసక్తే లేదంటున్నారు. తన రెమ్యూనరేషన్ సినిమా కథ, బడ్జెట్ ను బట్టి ఉంటాయని సత్యరాజ్ తెలిపారు. తన 47 ఏళ్ల కెరీర్లో చాలా సార్లు రెమ్యూనరేషన్ ను వదులుకున్నానని, కొన్ని సార్లు అప్పులు కూడా చేశానని వెల్లడించారు.
పాత్ర, బడ్జెట్‌ను బట్టే రెమ్యూనరేషన్
ఇప్పుడు తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సినిమాలు చేస్తున్నానని, దాని కోసం తాను రెమ్యూనరేషన్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, సినిమా మొదలవకముందే దాని గురించి డిస్కస్ చేస్తే పారితోషికం తక్కువైనా పర్లేదు కానీ సినిమా స్టార్ట్ అయ్యాక మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గనని, సినిమాలోని క్యారెక్టర్, కథ, బడ్జెట్ ను బట్టే రెమ్యూనరేషన్ ఉంటుందని, బాహుబలి సినిమాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ బార్బరిక్ మూవీకి తీసుకోలేను కదా అని అన్నారు సత్యరాజ్.
