హై-ప్రొఫైల్ స్కామ్ థ్రిల్లర్ రిటర్న్స్!
కొన్ని సినిమాలు ఎంత అద్భుతంగా రూపొందినా? అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది.
By: Srikanth Kontham | 15 Jun 2026 11:45 AM ISTకొన్ని సినిమాలు ఎంత అద్భుతంగా రూపొందినా? అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ఆ కోవకు చెందిన చిత్రమే `శతురంగ వేట్టై 2`. అరవింద్ స్వామి-త్రిష జంటగా నిర్మల్ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. ఇతర అడ్డంకులను దాటుకుంటూ ఎట్టకేలకు చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా వెనుక ఉన్న అతిపెద్ద విషాదం .. భావోద్వేగ ప్రయాణం దివంగత నటుడు, నిర్మాత మనోబాలది. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టారు.
సినిమా ఎలాగైనా థియేటర్ల వరకు తీసుకురావడానికి చివరి శ్వాస వరకు శ్రమించారు. చిత్రం ఆలస్యం అవుతున్న కొద్దీ మానసిక వేదనకు, ఒత్తిడికి గురయ్యారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఆయన తపన.. ఆ క్రమంలో ఎదురైన అడ్డంకులు ఆయనపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్క రించేందుకు చిత్రబృందం ప్రముఖ ఫైనాన్షియర్ మదురై అన్బుచెలియన్‌ను సంప్రదించింది.
దీనిపై స్పందించిన ఆయన మానవీయ కోణంలో ఎలాంటి ముందస్తు డబ్బు ఆశించకుండా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా థియేటర్ లోకి రావడం... కలెక్షన్లు రావడం ప్రారంభమయ్యాక తన వాటాను నెమ్మదిగా సెటిల్ చేసుకోవచ్చని చెప్పి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, త్రిషల కాంబినేషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. `తని ఒరువన్` చిత్రంతో విలక్షణ నటనతో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవింద్ స్వామి.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో రాణిస్తున్న క్వీన్ త్రిషల స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మైండ్ గేమ్ థ్రిల్లర్‌కు పీక్ రేంజ్ హైప్ తీసుకొస్తోంది.
మొదటి భాగం తరహాలోనే సమాజంలో జరిగే ఆధునిక మోసాలు, హై-ప్రొఫైల్ స్కామ్‌ల చుట్టూ తిరిగే కథలో ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ .. నటన ఎలా ఉండబోతోందా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించగా పవర్‌ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ సినిమాల దర్శకుడు హెచ్. వినోద్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వినోద్ రాసిన పదునైన సంభాషణలు, మైండ్ బ్లోయింగ్ కన్-డ్రామాలు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎట్టకేలకు అన్ని లీగల్ ..ఫైనాన్షియల్ చిక్కులు వీడి థియేటర్లలో అడుగుపెట్టబోతున్న `శతురంగ వేట్టై 2` ఒక సినిమా మాత్రమే కాదు. అది దివంగత నిర్మాత మనోబాల కలల రూపం. ఫైనాన్షియర్ల నుంచి లభించిన అపూర్వ మద్దతుతో సినిమా విడుదల కావడం పరిశ్రమలో సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న స్కామ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి.
