శాటిలైట్ మార్కెట్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?
ఇప్పుడు సినిమాలను ఆడియన్స్.. అయితే థియేటర్స్ లో చూస్తున్నారు.. లేదంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనే చూస్తున్నారు. కరోనా టైమ్ లో ఓటీటీలు తెగ పాపులర్ అయిపోయాయి.
By: M Prashanth | 2 Oct 2025 11:00 PM ISTసినీ ఇండస్ట్రీలోని శాటిలైట్ మార్కెట్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ల తర్వాత టీవీ ఛానెల్ లో ప్రసారం చేయాలంటే మేకర్స్ నుంచి శాటిలైట్ హక్కులను పొందాల్సి ఉంటుంది. దాని ద్వారా మేకర్స్ కు డబ్బులు వస్తాయి. సినిమా నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని తిరిగి పొందడానికి సహాయపడతాయి.
కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా శాటిలైట్ మార్కెట్ స్థిరంగా ఉందని చెప్పాలి. తద్వారా భారతీయ నిర్మాతలకు ప్రధాన వనరుగా నిలిచింది. బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. శాటిలైట్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది.
ప్రస్తుతం శాటిలైట్ ఛానెల్ లు సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసే విషయంలో అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు ఎంత పోటీ పడేవో.. ఇప్పుడు కనీసం హక్కులు సొంతం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అందుకు ముఖ్య కారణం.. ఇప్పుడు డిజిటల్ యుగం సినిమా ప్రపంచంలో ఆధిపత్యం వహించడమే.
ఇప్పుడు సినిమాలను ఆడియన్స్.. అయితే థియేటర్స్ లో చూస్తున్నారు.. లేదంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనే చూస్తున్నారు. కరోనా టైమ్ లో ఓటీటీలు తెగ పాపులర్ అయిపోయాయి. దీంతో సినీ ప్రేక్షకుల్లో చాలా తక్కువ మంది మాత్రమే టెలివిజన్ స్క్రీనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తక్కువ అంటే చాలా చాలా తక్కువనే చెప్పాలి.
ఒకప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు.. టీవీల్లో ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. థియేటర్లలో విడుదలైన 3-4 నెలల తర్వాత టీవీలో వస్తాయి. కానీ ఓటీటీల్లో మాత్రం.. థియేట్రికల్ రిలీజ్ కు మూడు నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొన్ని సూపర్ హిట్ సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయంతే.
అందుకే టీవీ స్క్రీనింగ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో వీక్షకుల సంఖ్య తగ్గడంతో శాటిలైట్ రైట్స్ తీసుకునే నిర్వాహకులు.. పెద్ద మొత్తంలో చెల్లించడానికి మొగ్గు చూపడం లేదు. చాలా తక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. అనేక సినిమాల రైట్స్ కూడా అమ్ముడుపోవడం లేదు. ఇప్పటికే చాలా మూవీలకు ఇలా జరిగింది.
అందులో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎందరో నటించిన సినిమాలు కూడా ఉండడం గమనార్హం. ఏదేమైనా నార్త్ టు సౌత్.. అన్ని సినీ ఇండస్ట్రీల్లో శాటిలైట్ మార్కెట్ బాగా పడిపోయింది. భవిష్యత్తులో ఇంకా డౌన్ అయిపోయే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
