సర్దార్ 2 ట్రైలర్: కార్తీ వర్సెస్ SJ సూర్య.. యాక్షన్ గట్టిగానే..
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్టర్ పిఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ 'సర్దార్' మంచి విజయాన్ని అందుకుంది.
By: M Prashanth | 31 Aug 2026 11:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్టర్ పిఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ 'సర్దార్' మంచి విజయాన్ని అందుకుంది. ఇక దానికి కొనసాగింపుగా వస్తున్న సినిమా 'సర్దార్ 2'. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఒక పక్క అదిరిపోయే యాక్షన్ విజువల్స్, మరోపక్క ఆకట్టుకునే డైలాగ్స్ తో ట్రైలర్ డిఫరెంట్ గా ఉంది.
సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ లో విజువల్స్ హై లెవెల్ లో కనిపిస్తున్నాయి. ఒక భారీ బ్లాక్ ఆప్స్ మిషన్ నేపథ్యం, విదేశీ లొకేషన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఫైట్స్, బ్లాస్టింగ్ సన్నివేశాలు చూస్తుంటే బడ్జెట్ గట్టిగానే పెట్టినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ స్పై సినిమాలా కాకుండా ఒక బలమైన ఎమోషనల్ కోణం కూడా ఇందులో ఉన్నట్లు ట్రైలర్ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.
ఈసారి కథను సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ తరహాలో కూడా నడిపిస్తున్నట్లు అర్థమవుతుంది. గతంలో మురుగన్ భక్తుడిగా ఉన్న చంద్రబోస్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా ఎలా మారాడు అనేది యంగ్ కార్తి పాత్ర ద్వారా చూపించారు. మిషన్ పూర్తి చేసినా తన వల్ల జరిగిన కొన్ని పరిణామాలు అతన్ని శాపంలా వెంటాడుతున్నాయని చెప్పే సీన్స్ కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు ప్రస్తుత కాలంలో కొడుకు విజయ్ ప్రకాష్ కూడా ఈ ఆపరేషన్ లోకి దిగడం కథలోని ట్విస్ట్ లను ఎలివేట్ చేసేలా ఉంది.
ట్రైలర్ లో డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు బాస్ అంటూ సాగే డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. అలాగే గతంలో చేసిన తప్పులు జీవితాంతం వెంటాడే శాపంలా మారాయని చెప్పే సన్నివేశాలు ఎమోషనల్ గా టచ్ అవుతాయి. నన్ను వదిలేయమంటున్నావా లేక నమ్మమంటున్నావా అంటూ సర్దార్ చెప్పే మాటలు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి.
ట్రైలర్ లో అసలైన హైలెట్ విలన్ ఎస్ జే సూర్య ఎంట్రీ. బ్లాక్ డాగర్ గా చాలా స్టైలిష్ గా, క్రూరమైన విలనిజంతో ఆయన కనిపించారు. సర్దార్ నేను నీ ఫ్యాన్ ని, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఏంటో నీకు చూపిస్తా అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కార్తి, ఎస్ జే సూర్య మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తాయని అర్థమవుతుంది.
ట్రైలర్ కు సామ్ సిఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. పవర్ ఫుల్ మ్యూజిక్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ను ఎలివేట్ చేసిన విధానం బాగానే ఉంది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ చిత్రం స్పై జోనర్ లో మరో ప్రయోగంలా నిలిచేలా కనిపిస్తోంది. ట్రైలర్ తోనే యాక్షన్ ఘట్టాన్ని హైలెట్ చేసిన సర్దార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
