Begin typing your search above and press return to search.

ఖుషి చేసిన ఇద్దరూ డీసీఎం, సీఎం అయిపోయారు: ఎస్.జె. సూర్య పంచ్!

దర్శకుడిగా, విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్.జె. సూర్య వేసే పంచులు, ఆయన మాట్లాడే తీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి

By:  M Prashanth   |   7 Sept 2026 9:38 AM IST
ఖుషి చేసిన ఇద్దరూ డీసీఎం, సీఎం అయిపోయారు: ఎస్.జె. సూర్య పంచ్!
X

దర్శకుడిగా, విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్.జె. సూర్య వేసే పంచులు, ఆయన మాట్లాడే తీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఆయన కార్తి హీరోగా తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్-2లో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో ఎస్.జె. సూర్య కీలక పాత్ర పోషించగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో మంచు మనోజ్ హోస్ట్‌గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

కార్తి, ఎస్.జె. సూర్యతో కలిసి మనోజ్ చేసిన ఈ చిట్‌చాట్‌లో సూర్య విసిరిన ఒక పొలిటికల్ సెటైర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంటర్వ్యూ సరదాగా సాగుతున్న సమయంలో సినిమాలో హీరో, విలన్ పాత్రల గురించి చర్చ మొదలైంది. ఈ మూవీలో మంచి విలన్, చెడ్డ హీరోస్ ఉన్నారని, మరి మనోజ్ ఎవరికి సపోర్ట్ చేస్తారంటూ సూర్య ప్రశ్నించారు.

దీనికి మనోజ్ స్పందిస్తూ తాను ఎస్.జె. సూర్య వైపే ఉంటానని నవ్వుతూ చెప్పారు. ఎందుకంటే భవిష్యత్తులో తనకు కూడా దర్శకత్వం చేయాలని ఉందని, ఆ కారణంతోనే సూర్యకు మద్దతు ఇస్తున్నానని మనోజ్ సరదాగా కవరింగ్ ఇచ్చారు.

మనోజ్ చెప్పిన డైరెక్షన్ పాయింట్‌ను పట్టుకుని ఎస్.జె. సూర్య తనదైన స్టైల్‌లో ఒక బ్లాస్టింగ్ కౌంటర్ వేశారు. తాను దర్శకత్వం వహించిన ఆల్‌టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ ఖుషి సినిమాను గుర్తు చేస్తూ ఆసక్తికర పోలిక తీసుకొచ్చారు.

'ఖుషి సినిమా చేసిన ఇద్దరిలో ఒకరు డెప్యూటీ సీఎం అయిపోయారు.. ఇంకొకరు సీఎం అయిపోయారు' అంటూ ఆయన వేసిన పంచ్‌తో కార్తి, మంచు మనోజ్ పడీపడీ నవ్వారు. తెలుగులో ఖుషి సినిమా చేసిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాగా, తమిళంలో చేసిన విజయ్‌ సీఎం అయ్యారు. దాంతో మనోజ్ వెంటనే స్పందిస్తూ.. 'అయితే కచ్చితంగా నన్ను డైరెక్ట్ చేయాల్సిందే' అంటూ మరో కౌంటర్ వదిలారు.

దీనిపై సూర్య కూడా ఏమాత్రం తగ్గకుండా, 'ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు భూమిక, ఎవరు పవన్ కళ్యాణ్ గారు' అంటూ కౌంటర్ వేయడంతో సరదా రచ్చ పీక్స్‌కు చేరింది. ఈ ఫన్ కాన్వర్జేషన్ తర్వాత సర్దార్ 2 సినిమా ప్రధాన నేపథ్యంపై కూడా టీమ్ చర్చించింది. సర్దార్ పార్ట్ 1లో నీటి మాఫియా గురించి చూపిస్తే, ఈ సీక్వెల్‌లో స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ మైనింగ్ చుట్టూ కథ నడుస్తుందని కార్తి వెల్లడించారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలను, పర్యావరణ పరిరక్షణను ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోతే భవిష్యత్ తరాలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారని మనోజ్, కార్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కీలకమైన సామాజిక అంశాన్ని చర్చిస్తూనే, మరోవైపు ఎస్.జె. సూర్య తన టైమింగ్‌తో ఇంటర్వ్యూ అంతటా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచారు.