Begin typing your search above and press return to search.

ఇండియన్‌ 2, సర్దార్ 2 లు మాత్రమే...!

సీక్వెల్‌కి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేనంతగా సినిమా డిజాస్టర్‌ టాక్‌ ను సర్దార్‌ 2 మొదటి రోజు మొదటి ఆటతోనే సొంతం చేసుకుంది.

By:  Ramesh Palla   |   18 Sept 2026 12:00 AM IST
ఇండియన్‌ 2, సర్దార్ 2 లు మాత్రమే...!
X

కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్దార్‌ 2' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సర్దార్‌కి వచ్చిన రెస్పాన్స్‌, ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ నేపథ్యంలో ఈ సీక్వెల్‌కి భారీగా ఖర్చు చేశారు. కార్తీ కెరీర్‌లోనే హైయెస్ట్‌ బడ్జెట్‌ మూవీగా సర్దార్‌ 2 ప్రచారం జరిగింది. సినిమా కోసం కార్తీ సైతం చాలా కష్టపడ్డాడు. దాదాపు ఏడాది పాటు మరే సినిమాపై దృష్టి పెట్టకుండా కేవలం సర్దార్‌ 2 ని మాత్రమే చేయడం వల్ల అభిమానులతో పాటు అంతా సర్దార్‌ 2 పై అంచనాలు పెంచుకున్నారు. సినిమా ప్రమోషన్‌ సమయంలోనూ కార్తీ చాలా నమ్మకంగా కనిపించాడు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ సినిమా భారీగా విడుదల చేయడం జరిగింది. చిన్న సినిమాలు పోటీ ఉన్నప్పటికీ సర్దార్‌ 2 కి కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయని, కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలుస్తుందని భావించారు. కానీ అంచనాలు తలకిందులు అయ్యాయి.

సర్దార్‌ 2 సినిమాతో బాక్సాఫీస్‌...

సీక్వెల్‌కి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేనంతగా సినిమా డిజాస్టర్‌ టాక్‌ ను సర్దార్‌ 2 మొదటి రోజు మొదటి ఆటతోనే సొంతం చేసుకుంది. అందుకే మినిమం ఓపెనింగ్స్ సైతం సినిమా రాబట్టలేకపోయింది. మొదటి వారం రోజులు కిందా మీదా పడి ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ కనీసం రెండు మూడు రోజులు కూడా సర్దార్‌ 2 కి బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించలేదు. అందుకు ప్రధాన కారణం చిన్న సినిమాగా విడుదలైన 'మండాడి' అనడంలో సందేహం లేదు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మండాడి సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. కేవలం మండాడి సినిమా వల్ల కార్తీ యొక్క సర్దార్‌ 2 సినిమా వసూళ్లు తగ్గాయని కొందరు అంటున్నారు. కానీ సర్దార్‌ 2 సినిమాకు మినిమం హిట్ టాక్‌ వచ్చినా తప్పకుండా మంచి ఓపెనింగ్‌ ఉండేది, మండాడి సినిమాను మించిన వసూళ్లు వచ్చి ఉండేవి అనేది బాక్సాఫీస్ వర్గాల వారి మాట.

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో సీక్వెల్స్‌...

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌, మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా సీక్వెల్స్ వచ్చాయి. గడచిన మూడు ఏళ్లలో వచ్చిన సీక్వెల్స్‌ను ఒకసారి చూస్తే ఇండియన్‌ 2 అతి పెద్ద డిజాస్టర్‌గా నిలువగా, ఆ తర్వాత కార్తీ సర్దార్‌ 2 సినిమా డిజాస్టర్‌గా నిలిచిందంటూ సోషల్‌ మీడియాలో కొందరు లెక్కలతో సహా పోస్ట్‌ చేస్తున్నారు. కార్తీ హిట్‌ మూవీకి సీక్వెల్‌ అని చూశాడు తప్ప, సీక్వెల్‌లో ఉన్న కథ ఏంటి అనేది చూసినట్లుగా లేడని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. కోలీవుడ్‌ నుంచి ఈమధ్య కాలంలో వచ్చిన సీక్వెల్స్‌ అరన్మనై 4, డిమోంటే కాలనీ 2 సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి వచ్చిన సీక్వెల్స్ సైతం విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కేవలం సర్దార్‌ 2 కి మాత్రమే కాలం కలిసి రాలేదు అని కార్తీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్తీ సర్దార్‌ 2 బాక్సాఫీస్ రిపోర్ట్‌

2022లో వచ్చిన స్పై థ్రిల్లర్‌ 'సర్దార్‌' కి సీక్వెల్‌గా వచ్చిన సర్దార్‌ 2 సైతం స్పై ఏజెంట్ నేపథ్యంలో ఉంటుంది. కార్తీని ఈ సినిమాలో డ్యూయెల్‌ రోల్‌లో చూపించడం జరిగింది. ఈ సినిమా కోసం దర్శకుడు కాస్త ఎక్కువగానే ఖర్చు చేయించాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయడం వల్ల బడ్జెట్‌ పెరిగింది. అంతే కాకుండా సినిమాలో భారీ తారాగణం నటించడం వల్ల కూడా బడ్జెట్‌ పెరిగిందని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. సినిమాలో ఉన్న కామెడీ సీన్స్‌, కొన్ని యాక్షన్‌ సీన్స్‌ విసుగు తెప్పించే విధంగా ఉన్నాయంటూ రివ్యూలు వచ్చాయి. అంతే కాకుండా కార్తీని సరిగ్గా వాడుకోలేదని, కాన్సెప్ట్‌, స్టోరీ లైన్‌ బాగున్నా స్క్రీన్‌ ప్లే విషయంలో పూర్తిగా దర్శకుడు నిరాశ పరిచాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. సర్దార్ 2 తర్వాత సర్దార్‌ 3 సైతం అనుకున్నారు. మరి దర్శకుడు మిత్రన్‌ సర్దార్‌ 3 గురించి ఏమంటాడో చూడాలి.