Begin typing your search above and press return to search.

సర్దార్ 2 పెట్టింది ఎంత.. రావాల్సింది ఎంత?

మొదటి సర్దార్ ఈ స్థాయిలో సిద్ధమైన సినిమా కాదు. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.

By:  M Prashanth   |   10 Sept 2026 9:14 AM IST
సర్దార్ 2 పెట్టింది ఎంత.. రావాల్సింది ఎంత?
X

కార్తి సర్దార్ 2 ఈసారి భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్ స్కేల్ చాలా పెరిగింది. విదేశాల్లో షూటింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎస్.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ లాంటి పెద్ద కాస్టింగ్‌తో సినిమాను రూపొందించారు. నిర్మాతలు బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు జరిగినట్టు టాక్ ఉంది.

మొదటి సర్దార్ ఈ స్థాయిలో సిద్ధమైన సినిమా కాదు. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. తెలుగులో కూడా మంచి లాభాలు ఇచ్చింది. దీంతో రెండో భాగాన్ని పెద్దగా ప్లాన్ చేశారు. కథను విదేశాలకు తీసుకెళ్లడంతో పాటు కార్తి స్పై పాత్రకు మరింత భారీ యాక్షన్ కూడా జోడించారు.

సర్దార్ 2 థియేట్రికల్ బిజినెస్‌లో తమిళనాడు మెయిన్ మార్కెట్. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్కడి హక్కులు దాదాపు రూ.54 కోట్ల రేంజ్‌లో జరిగాయి. కార్తి కెరీర్‌లో ఇది పెద్ద డీల్‌గా చెబుతున్నారు. తమిళనాడులోనే డిస్ట్రిబ్యూటర్‌కు ఆ స్థాయికి తగ్గ షేర్ రావాలి. కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లు కూడా మొత్తం వసూళ్లలో కీలకంగా మారనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి కొంచెం వేరు. సర్దార్ 2ను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. మొదటి సర్దార్‌కు ఏపీ, తెలంగాణలో దాదాపు రూ.5 కోట్ల బిజినెస్ జరగగా, రూ.5.5 కోట్ల షేర్ టార్గెట్‌గా ఉండేది. చివరకు దాదాపు రూ.7 నుంచి రూ.8 కోట్ల మధ్య షేర్ సాధించినట్టు అప్పటి ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి.

ఆ తర్వాత కార్తి జపాన్ తెలుగు బిజినెస్ రూ.6 కోట్ల రేంజ్‌లో జరిగింది. సత్యం సుందరం కూడా దాదాపు అదే స్థాయిలో వెళ్లింది. ఇప్పుడు సర్దార్ బ్రాండ్, సీక్వెల్ హైప్ కలవడంతో సర్దార్ 2కు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 నుంచి రూ.10 కోట్ల షేర్ వస్తే మంచి థియేట్రికల్ రన్‌గా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రాస్ పరంగా ఇది దాదాపు రూ.15 కోట్లకు పైగా వెళ్లాల్సిన రేంజ్.

ప్రపంచవ్యాప్తంగా సర్దార్ 2కు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వస్తే సినిమా చేసిన స్కేల్‌కు తగ్గ స్థాయిలో నిలుస్తుందని ట్రేడ్‌లో అంచనాలు ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్, ఇతర భాషల హక్కుల ద్వారా వచ్చే ఆదాయం నిర్మాతలకు అదనంగా ఉంటుంది. అయితే తమిళనాడులో రూ.54 కోట్ల బిజినెస్ ఉండటంతో అక్కడ మొదటి వారం వసూళ్లు చాలా కీలకం. తెలుగులో మాత్రం వీకెండ్ లో స్ట్రాంగ్ గా నిలబడాలి. మరి కార్తీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.