Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు కాబోయే వాడి స్వ‌రూపం తెలిసిపోతే వ‌దిలేయ‌డమే మేలు!- సారా టెండూల్క‌ర్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన వివాహం, ప్రేమ, కాబోయే భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Sivaji Kontham   |   11 Aug 2026 8:00 AM IST
పెళ్లికి ముందు కాబోయే వాడి స్వ‌రూపం తెలిసిపోతే వ‌దిలేయ‌డమే మేలు!- సారా టెండూల్క‌ర్
X

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన వివాహం, ప్రేమ, కాబోయే భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కోరుకున్న పర్ఫెక్ట్ లక్షణాలు ఉన్న వ్యక్తి లభించినప్పుడే వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా తన తల్లిదండ్రుల వైవాహిక బంధం తనకు ఎంతగానో ప్రేరణనిస్తుందని తెలిపారు.

సారా త‌న త‌ల్లిదండ్రుల (స‌చిన్-అంజ‌లి) మ‌ధ్య ప్రేమానుబంధం గురించి వెల్ల‌డించారు. మొద‌ట ఆ ఇద్ద‌రూ మంచి స్నేహితులు.. వ‌రి మ‌ధ్మ క‌ల‌హాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయ‌ని అన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు ఉండదు.. అది నిజంగా అద్భుతం. ఇంట్లో వారిద్దరూ ఎంతో సరదాగా గొడవపడుతుంటారు.. నా కాబోయే భాగస్వామిలో కూడా నేను అలాంటి సరదా వాతావరణాన్నే కోరుకుంటున్నాను! అని వెల్లడించారు. సాంకేతికత లేని రోజుల్లో కూడా వారు లాంగ్ డిస్టెన్స్ బంధాన్ని ఎంతో ప్రేమగా నిలబెట్టుకున్నారని కొనియాడారు.

ప్రేమ -సోల్‌మేట్స్ (ఆత్మబంధువులు) అనే భావనపై మాట్లాడిన సారా ''నా దృష్టిలో ప్రేమ అంటే స్నేహమే'' అని స్పష్టం చేశారు. తన ప్రాణస్నేహితులంతా వంద శాతం తనకు సోల్‌మేట్స్‌తో సమానమని... అయితే తన జీవిత భాగస్వామిని మాత్రం ఒక రొమాంటిక్ సోల్‌మేట్‌గా చూడాలనుకుంటున్నానని నవ్వుతూ చెప్పారు. స్నేహంతో కూడిన ప్రేమే జీవితాంతం నిలిచివుంటుందని బలంగా నమ్ముతున్న‌ట్టు తెలిపారు.

అలాగే ప్రస్తుత జనరేషన్ వైవాహిక సంబంధాల గురించి సారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ తరం బంధాలకు విలువ ఇవ్వలేదని భావించడం పొరపాటని...బంధం సరిగ్గా సాగనప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధైర్యం ఈ తరానికి ఉందన్నారు. పెళ్లికి ముందు లేదా నిశ్చితార్థం సమయంలో భాగస్వామి లేదా వారి కుటుంబ నిజరూపం తెలిసినప్పుడు ఇష్టం లేని పెళ్లిని ఆపేసి వెనక్కి తగ్గడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.

1997 అక్టోబర్ 12న ముంబైలో జన్మించిన సారా టెండూల్కర్.. సచిన్-అంజలి దంపతుల పెద్ద కుమార్తె. తన స్పష్టమైన ఆలోచనలు, స్వతంత్ర వ్యక్తిత్వంతో సారా ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా.. అధునాత‌న‌ భావాలను నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు.