Begin typing your search above and press return to search.

దీపావ‌ళి ప్ర‌క‌ట‌న‌లు: హీరోయిన్‌ల వేష‌ధార‌ణ‌ల‌పై ర‌చ్చ రచ్చ‌

ఈ క్రమంలోనే ప్రముఖ చాక్లెట్ బ్రాండ్ ప్రకటనలో నటించిన నటి సారా అలీ ఖాన్ లుక్‌పై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

By:  Sivaji Kontham   |   27 Oct 2026 6:00 AM IST
దీపావ‌ళి ప్ర‌క‌ట‌న‌లు: హీరోయిన్‌ల వేష‌ధార‌ణ‌ల‌పై ర‌చ్చ రచ్చ‌
X

పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ప్రముఖ బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రచారానికి సరికొత్త యాడ్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. నాలుగైదేళ్ల క్రితం స‌రిగ్గా దీపావ‌ళి రోజున సీకే బ్రాండ్ లోదుస్తులు తొడుక్కుని దిశా ప‌టానీ దీపారాధన చేసిన‌ యాడ్ ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో బిగ్ బ్లాస్ట్ అయింది. కానీ ఆ ప్ర‌క‌ట‌న చాలా వివాదాల‌ను మోసుకొచ్చి బ్రాండ్ కి కావాల్సిన మైలేజ్ ని కూడా తెచ్చింది. అప్ప‌టి నుంచి ఆ సీజ‌న్ ని ప్ర‌క‌ట‌న‌ల కంపెనీలు క్రేజీగా ఫీల‌వుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో పండుగల నేపథ్యంగా వచ్చే ప్రకటనలు బ్రాండ్ల ప్రచారంతో పాటు వివాదాలకు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు కూడా ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. ఒక ర‌కంగా దిశా ప‌టానీ సీకే ప్ర‌క‌ట‌న ఆద‌ర్శంగా ఆ త‌ర్వాత చాలా కంపెనీలు దానిని ఫాలో చేయ‌డ‌మే ఈ వివాదాల‌కు కార‌ణ‌మ‌ని కూడా విశ్లేషించ‌వ‌చ్చు.

గతంలో రక్షా బంధన్ సందర్భంగా నటి కృతి సనన్ నటించిన ప్రకటన హిందూ భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉందంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవ్వడం.. చివరికి సంబంధిత బ్రాండ్ బహిరంగ క్షమాపణలు చెప్పడం చూశాం. ఇప్పుడు దీపావళి పండుగ దగ్గరపడుతుండటంతో మరిన్ని దీపావళి సెంట్రిక్ యాడ్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ చాక్లెట్ బ్రాండ్ ప్రకటనలో నటించిన నటి సారా అలీ ఖాన్ లుక్‌పై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ పండుగ వాతావరణంలో సారా ధరించిన దుస్తులు పండుగ శోభకు తగినట్లుగా లేవంటూ కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఆ బ్రాండ్ ప్రకటనలో సంప్రదాయ ఆచారాలను కించపరచకుండా... పండుగ సంస్కృతిని ప్రతిబింబించేలా జాగ్రత్త పడిందని.. సారా అలీ ఖాన్ ఎత్నిక్ లుక్స్ చాలా బాగున్నాయని మెజారిటీ నెటిజన్లు ఆ ప్రకటనను ఆదరించడం విశేషం.

ప్రస్తుతం ఇండియన్ ఇంటర్నెట్ - సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పండుగల ప్రకటనల్లో నటించే కథానాయికలను టార్గెట్ చేయడం ఒక పరిపాటిగా మారిపోయింది. చిన్న అంశాన్ని కూడా పెద్దదిగా చేస్తూ.. ప్రకటనల్లోని కాస్ట్యూమ్స్ లేదా కాన్సెప్ట్‌ను విమర్శిస్తూ హీరోయిన్లపై ట్రోలింగ్ చేయడం సర్వసాధారణమైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని మునుముందు మరిన్ని యాడ్స్ రానున్న నేపథ్యంలో, ఈ తరహా చర్చలు - విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు బ్రాండ్లు - అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు పండుగల నేపథ్యంతో ప్రకటనలను రూపొందించేటప్పుడు సంస్కృతి, సాంప్రదాయాలు.. ప్రేక్షకుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల‌ని కోరుకుంటున్నారు. ఏదేమైనా.. ప్రచార ఆర్భాటాల నడుమ కథానాయికలను టార్గెట్ చేసే ఈ నయా ట్రెండ్ ప్రస్తుతం సినీ -ప్రకటనల రంగంలో చర్చనీయాంశంగా మారింది.