Begin typing your search above and press return to search.

సప్నా దీదీ పేరుతో ముద్దులు సరి కాదు...!

ముంబైతో పాటు, నార్త్‌ ఇండియాలో కొన్నాళ్ల పాటు సప్నా దీదీ అలియాస్‌ అష్రఫ్‌ ఖాన్‌ పేరు ప్రముఖంగా వినిపించింది.

By:  Ramesh Palla   |   19 Jan 2026 12:00 PM IST
సప్నా దీదీ పేరుతో ముద్దులు సరి కాదు...!
X

ముంబైతో పాటు, నార్త్‌ ఇండియాలో కొన్నాళ్ల పాటు సప్నా దీదీ అలియాస్‌ అష్రఫ్‌ ఖాన్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒక సాధారణ మహిళ ఎలా రెబల్‌గా మారింది, అందుకు వెనుక జరిగిన పరిణామాలు ఏంటీ అనేది ఇప్పటికీ ఆసక్తికరమే. ముంబైలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సప్నా దీదీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొందరు ఆమెను విమర్శిస్తే, కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా మాట్లాడే వారు ఉంటారు. ఎంతటి గొప్ప వారు అయినప్పటికీ కొంత మందికి అయినా ఏదో ఒక సమయంలో ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది. ఆ కారణం వల్లే సప్నా దీదీని కొందరు విమర్శిస్తారని, ఆమెను ఇష్టపడే వారు, ఆమెకు మద్దతుగా నిలిచిన వారు ఎక్కువ మంది ఉంటారని అంటారు. ఇప్పుడు మరోసారి సప్నా దీదీ గురించి చర్చ మొదలు అయింది. ఆమె జీవితం అంటూ ఒక సినిమా రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ సినిమాపై పడింది.

బాలీవుడ్‌లో రూపొందిన ఓ రోమియో...

సప్నా దీదీని ఇష్టపడే వారు మాత్రమే కాకుండా ఆమెను వ్యతిరేకించే వారు సైతం సినిమా విషయంలో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆమెను గురించి సినిమాలో ఎలా చూపిస్తారా అనే చర్చ ఇప్పటికే ప్రారంభం అయింది. 'ఓ రోమియో' అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో సప్నా దీదీ పాత్రను క్రియేట్‌ చేశారనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. కానీ పబ్లిసిటీ కోసం ఆమె పేరును ఇప్పటికే లీక్ చేయడం జరిగింది అనేది కొందరి మాట. మొత్తానికి సప్నా దీదీ పాత్ర విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో సినిమా నుంచి వచ్చిన ఒక పోస్టర్ మరింతగా చర్చనీయాంశం అయింది. ఆ పోస్టర్‌లో త్రిప్తి డిమ్రి, షాహిద్ కపూర్‌ల మధ్య అదర చుంబనం ఉండటంతో సప్నా దీదీ విషయాన్ని ఈ సినిమాలో ఎలా చూపించాలని దర్శకుడు అనుకుంటున్నాడు అర్థం కావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మాఫియా క్వీన్‌ ఆఫ్ ముంబై

ఒకానొక సమయంలో మాఫియా క్వీన్‌ ఆఫ్ ముంబై అంటూ పేరు దక్కించుకున్న సప్నా దీదీని ఇలా రొమాంటిక్ పాత్రలో చూపించడం అంటే కచ్చితంగా ఆమె జీవితాన్ని వక్రీకరించి చూపించడం అవుతుంది అంటూ చాలా మంది ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. సప్నా దీదీ యొక్క భర్త మెహమూద్‌ విమానాశ్రయంలో దావూద్‌ ఇబ్రహీం నెట్‌వర్క్ కారణంగా హత్యకు గురి అయ్యాడు అనేది అందరికీ తెలిసిన విషయం. భర్త హత్య కారణంగా అప్పటి వరకు సాధారణ మహిళగా ఉన్న అష్రఫ్‌ ఖాన్‌ అనూహ్యంగా సప్నా దీదీగా మారి మొత్తం ముంబై అండర్‌ వరల్డ్‌ ను తన గుప్పిట పెట్టుకునే ప్రయత్నం చేసింది. అందుకోసం ఆమె చాలా దారుణాలు చేసింది అనేది కొందరి ఆరోపణ. ఆమె తన భర్త మృతికి ప్రతీకారం తీర్చుకోవాలి అని కాకుండా, మరింతగా ముంబై అండర్‌ వరల్డ్‌ కంట్రోల్‌ లోకి వెళ్లకుండా చూసింది అనేది కొందరి అభిప్రాయం.

త్రిప్తి డిమ్రి, షాహిద్‌ కపూర్‌...

మొత్తానికి సప్నాదీదీ ముంబై అండర్‌ వరల్డ్‌ ను కొన్నాళ్ల పాటు శాసించింది. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను చాలా పవర్‌ ఫుల్‌గా తీయాల్సింది పోయి ఇలా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నట్లు చూపించడం ఏంటి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమా లోని త్రిప్తి డిమ్రి పాత్ర కనుక సప్నా దీదీ పాత్రను పోలి ఉండి, ఆమె జీవితంతో సంబంధం ఉన్న పాత్ర అయితే కచ్చితంగా ఆ ముద్దు సీన్‌ సినిమాలో ఉండటానికి వీలు లేదు అంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. సప్నా దీదీ వంటి వ్యక్తి సినిమాను ఇలా రొమాంటిక్ మూవీగా తీయడం కరెక్ట్‌ కాదని, ఇలాంటి సీన్స్ ఆమె పాత్రకు సరి కాదనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, సినిమా తుది ఎడిట్‌లో ఆ సీన్‌ ఉంటుందా, విడుదల సమయంకు ఇంకా ఎన్ని వివాదాలను ఈ సినిమా మూట కట్టుకోవలసి వస్తుందో అనే చర్చ జరుగుతోంది.