హిట్‌తో యంగ్‌హీరో సరికొత్త యాత్ర షురూ...!
కపుల్ ఫ్రెండ్లీ సినిమా తర్వాత సంతోష్ శోభన్ ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. ఇప్పటికే తన తదుపరి సినిమాకు ఓకే చెప్పాడు.
By: Ramesh Palla | 6 April 2026 2:57 PM ISTమహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలను తీసి తక్కువ సమయంలోనే సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్స్‌ను చవిచూసిన దర్శకుడు శోభన్. చిన్న వయసులోనే మృతి చెందిన దర్శకుడు శోభన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో మాట్లాడుకునే విధంగా సూపర్ హిట్‌లను అందించాడు. ప్రభాస్‌కి వర్షంతో ఇచ్చిన సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన కొడుకులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్‌లు హీరోలుగా వరుస సినిమాలు చేస్తున్నాడు. సంతోష్ శోభన్ కెరీర్ ఆరంభించి చాలా కాలం అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో హిట్స్ లేకపోవడంతో ఆ మద్య చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. చాలా పెద్ద గ్యాప్ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా సంతోష్ శోభన్ కి బూస్ట్ ఇచ్చినట్లు అయింది.
సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ...
కపుల్ ఫ్రెండ్లీ సినిమా తర్వాత సంతోష్ శోభన్ ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. ఇప్పటికే తన తదుపరి సినిమాకు ఓకే చెప్పాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన స్వాతిముత్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వంలో సంతోష్ శోభన్ కొత్త సినిమా ఉండబోతుంది. దర్శకుడిగా లక్ష్మణ్ కృష్ణకి స్వాతిముత్యం మంచి పేరు తెచ్చి పెట్టింది. కానీ ఆయన తదుపరి సినిమా చేయడానికి చాలా సమయం పట్టింది. ఇప్పటి వరకు స్క్రిప్ట్ పై కూర్చున్న దర్శకుడు లక్ష్మణ్ ఎట్టకేలకు విభిన్నమైన ఎంటర్‌టైన్ మూవీని సంతోష్ శోభన్ తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు నిర్మించబోతున్నారు. సంతోష్ శోభన్ గత చిత్రాలను సైతం వరుసగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో సినిమాను సైతం యూవీ క్రియేషన్స్‌లోనే సంతోష్ చేయబోతున్నాడు.
లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వంలో సత్తిబాబు పరలోక యాత్ర
సంతోష్ శోభన్ హీరోగా లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్న సినిమాకు విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం 'సత్తిబాబు పరలోక యాత్ర' అనే టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించారని తెలుస్తోంది. ఈ టైటిల్ తోనే సినిమా జోనర్ ఏంటో అర్థం అవుతోంది. తప్పకుండా ఇది సంతోష్ శోభన్‌కి మంచి పేరును తెచ్చి పెడుతుందని, ప్రేక్షకులను నవ్వించే విధంగా ఉంటుందనే పాజిటివ్ బజ్ సోషల్ మీడియాలో వచ్చింది. తప్పకుండా ఈ సినిమాతో సంతోష్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని ఆయన సన్నిహితులు నమ్ముతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. కనుక ఈ కథపై చాలా నమ్మకం ఉంచి వారు నిర్మించేందుకు ఓకే చెప్పి ఉంటారనే టాక్ వినిపిస్తుంది.
సంగీత్ శోభన్ వరుస సినిమాలు...
దర్శకుడిగా లక్ష్మణ్ కృష్ణ కి మంచి పేరు ఉంది, పైగా సెన్సిబుల్ దర్శకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నాడు. మరో వైపు సంతోష్ శోభన్ కూడా సెన్సిబుల్ హీరోగా పేరు సొంతం చేసుకున్నాడు. అందుకే వీరిద్దరి కాంబో కచ్చితంగా వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కామెడీ సినిమాలకు మంచి ఆధరణ దక్కుతున్న ఈ సమయంలో టైటిల్ నుంచే వినోదాన్ని పంచే సినిమాలకు ఎలాంటి స్పందన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కనుక సంతోష్ సైతం కామెడీ సినిమాలతో మెప్పించి, హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే 'సత్తిబాబు పరలోక యాత్ర' మొదలు కాబోతుంది. మరి పూర్తి అయ్యేది ఎప్పుడు, థియేటర్‌లకు వచ్చేది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.
