ఆ గొప్ప అవకాశం నాకే లభించింది - సంతోష్ శోభన్
విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువగా.. సంతోష్ శోభన్ కెరీర్ ఆరంభం నుండి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కథా బలమున్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
By: Madhu Reddy | 3 Feb 2026 12:00 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తాజాగా ఆయన నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ లో ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంతోష్ పంచుకున్న తన చిన్ననాటి జ్ఞాపకాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకునిగా సినిమా చూసిన అదే థియేటర్ వేదికపై, నేడు హీరోగా నిలబడటం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. వివరాలలోకి వెళితే..
సత్యం థియేటర్ జ్ఞాపకాలు:
ఎమోషనల్ అయిన సంతోష్ శోభన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. "నేను చిన్నప్పుడు ఇదే సత్యం థియేటర్లో గంటల తరబడి క్యూలో నిలబడి వెంకటేష్ గారి సినిమాలు, మహేష్ బాబు గారి 'మురారి', ప్రభాస్ అన్న 'వర్షం' సినిమాలు చూశాను. అప్పుడు కేవలం ఒక అభిమానిగా ఇక్కడికి వచ్చేవాడిని. కానీ నేడు అదే వేదికపై నా సినిమా ట్రైలర్ విడుదల కావడం చూస్తుంటే మాటలు రావడం లేదు. ఆ గొప్ప అవకాశం నాకే లభించింది" అని సంతోష్ చెప్పారు. తన ఎదుగుదలకు కారణమైన అభిమానులకు, కుటుంబానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
సంతోష్ శోభన్ గత చిత్రాల ప్రస్థానం:
విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువగా.. సంతోష్ శోభన్ కెరీర్ ఆరంభం నుండి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కథా బలమున్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. 'గోల్కొండ హైస్కూల్'లో బాలనటుడిగా మెరిసిన సంతోష్, 'పేపర్ బాయ్' చిత్రంతో హీరోగా తన ఉనికిని చాటుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'ఏక్ మినీ కథ' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా, 'మంచి రోజులు వచ్చాయి' వంటి చిత్రాలతో సూపర్ సక్సెస్ అందుకొని..ఈ చిత్రాలే ఆయనకు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిపెట్టాయి. ప్రతీ సినిమాలోనూ పక్కింటి అబ్బాయిలా కనిపించే ఆయన నటన, సహజత్వానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఆయనను త్వరగా ఓన్ చేసుకున్నారు అనటంలో సందేహం లేదు.
ఒక సామాన్య ప్రేక్షకుని స్థాయి నుండి హీరోగా ఎదిగి, తను ఆరాధించే హీరోల సినిమాలు చూసిన థియేటర్లోనే తన సినిమా వేడుక చేసుకోవడం సంతోష్ శోభన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం. ఇక ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజు ఈ మూవీ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, టీజర్ సినిమా పైన అంచనాలు పెంచేసాయి. ఇక 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో ఆయన మరో విజయాన్ని అందుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
