Begin typing your search above and press return to search.

సంతాన ప్రాప్తిర‌స్తు.. చాందిని మెరుపులే మెరుపులు

కొన్నేళ్లుగా చాందిని చౌద‌రి న‌ట‌నా రంగంలో కెరీర్ ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తోంది. కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన చాందిని విశాఖ అమ్మాయి.

By:  Sivaji Kontham   |   11 Nov 2025 6:00 AM IST
సంతాన ప్రాప్తిర‌స్తు.. చాందిని మెరుపులే మెరుపులు
X

ఒక తెలుగ‌మ్మాయికి అవ‌కాశం రావ‌డ‌మే గొప్ప అనుకుంటే, ఇప్పుడు చాలా మంది తెలుగమ్మాయిలదే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో హ‌వా. కేవ‌లం తెలుగు చిత్రాల్లోనే కాదు, ఇరుగు పొరుగు భాష‌ల్లోను రాణిస్తున్న తెలుగమ్మాయిలు ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలు, ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా త‌మ‌ను తాము ప‌రిచ‌యం చేసుకుని న‌టీన‌టులుగా ఎదుగుతున్న వారు ఉన్నారు. ఆరంభం ల‌ఘు చిత్రాల‌తో పాపుల‌రైన‌ చాందిని చౌద‌రి తెలుగు చిత్ర‌సీమ‌లో క‌థానాయికగా అవ‌కాశాలు అందుకుని, బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ బండిని న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

కొన్నేళ్లుగా చాందిని చౌద‌రి న‌ట‌నా రంగంలో కెరీర్ ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తోంది. కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన చాందిని విశాఖ అమ్మాయి. బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘచిత్రాలలో నటించింది. ఆరంభం యమ్.ఆర్ ప్రొడక్షన్స్ వారి `ది వీక్` అనే లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ ఇలా వ‌రుస‌గా లఘు చిత్రాల‌లో న‌టించ‌గా చాందినికి గుర్తింపునిచ్చాయి. మొదట్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తో కలిసి చాలా లఘు చిత్రాలలో నటించి విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. అందులో ఒకటి `ది బ్లైండ్ డేట్`. అయితే ఈ జంట పెద్ద తెర‌పై మాత్రం క‌లిసి న‌టించ‌లేదు.

2013లో వచ్చిన మధురం లఘచిత్రంలో చాందిని నటనను చూసిన ముళ్ళపూడి వరా, కె.రాఘవేంద్రరావులు `కుందనపు బొమ్మ` అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది. 2015లో కేటుగాడు చిత్రంతో తెలుగు చలన చిత్ర తెరకు పరిచయం అయ్యింది. అంతకుముందు తను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో చిన్న పాత్రలు పోషించింది. ఆ తరువాత కేటుగాడు సినిమాలో కధానాయికగా నటించిన చాందిని బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో కూడా నటించింది. 2018లో వచ్చిన మను సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది. 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో నటించింది. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వెనుదిర‌గ‌లేదు.

ఇప్పుడు చాందిని చౌద‌రి క‌థానాయిక‌గా, విక్రాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `సంతాన ప్రాప్తిరస్తు` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్‌లపై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్విప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్‌కు ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. నవంబర్ 14న సినిమా థియేట‌ర్ల‌లో విడుదల కానుంది. సోమ‌వారం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌లో చిత్ర‌బృందం సంద‌డి చేసింది. ఈ వేడుక ఆద్యంతం చాందిని చౌద‌రి మిరుమిట్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. అచ్చ తెలుగు అమ్మాయి ట్రెడిష‌న‌ల్ దుస్తుల్లో ఎంతో అందంగా క‌నిపించింది. ఈ సినిమా ట్రైల‌ర్ కు పాజిటివ్ బ‌జ్ రావ‌డంతో చిత్ర‌బృందం రెట్టించిన ఆనందంతో ప్ర‌చారంలో వేగం పెంచింది.