కృష్ణావతారం పార్ట్-1: వెండితెరకు గుజరాత్ మాజీ CM మనవరాలు పరిచయం
జయానా త్వరలోనే విడుదల కానున్న పౌరాణిక చిత్రం `కృష్ణావతారం పార్ట్-1: ది హార్ట్` ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు.
By: Sivaji Kontham | 20 April 2026 5:00 AM ISTరాజకీయ కుటుంబాల నుండి వారసులు రాజకీయాల్లోకి రావడం సాధారణం... కానీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయనా మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. జయానా త్వరలోనే విడుదల కానున్న పౌరాణిక చిత్రం `కృష్ణావతారం పార్ట్-1: ది హార్ట్` ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒక కమర్షియల్ బాలీవుడ్ సినిమాతో కాకుండా.. ఆధ్యాత్మికత- భక్తి నేపథ్యం ఉన్న పౌరాణిక చిత్రంతో ఈ యువనటి తెరంగేట్రం చేయడం విశేషం.
ఈ చిత్రంలో సంస్కృతి జయనా శ్రీకృష్ణుని ప్రియురాలు వీరవనిత `సత్యభామ` పాత్రలో కనిపిస్తున్నారు. కేవలం ఒక పాత్రలా కాకుండా.. ఈ కథ మొత్తం సత్యభామ కోణంలోనే సాగుతుండటం గమనార్హం. ప్రేమ, బలం, అంతర్గత పరివర్తన వంటి అంశాలను ఈ సినిమా స్పృశిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ గుప్తా శ్రీకృష్ణుడిగా నటిస్తుండగా.. రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటిస్తున్నారు. హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 7న థియేటర్లలో విడుదల కానుంది.
సంస్కృతి జయనా కేవలం నటి మాత్రమే కాదు.. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త కూడా. అహ్మదాబాద్ నుండి లండన్ వరకు ఆమె విద్యాభ్యాస ప్రయాణం సాగింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ పట్టా పొందిన ఈ యంగ్ ట్యాలెంట్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో నటన -నృత్యంలో శిక్షణ పొందారు. 16 ఏళ్ల వయసులోనే తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించి జిమ్మీ చూ, బొట్టెగా వెనెటా వంటి గ్లోబల్ బ్రాండ్‌లతో కలిసి పని చేసిన అనుభవం ఆమెకు ఉంది.
సంస్కృతి వ్యక్తిత్వ పరంగా పెరిగిన వాతావరణం వల్ల ఎంతో ప్రభావితమైంది. కేవలం అధికార వర్గాల్లోనే కాకుండా గ్రామాల్లో, పొలాల్లో సామాన్యుల మధ్య జయనా పెరిగారు. తన తల్లిదండ్రులతో కలిసి `సేవా కేఫ్` వంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో.. వేలాది మంది పిల్లలకు అండగా నిలిచే `మానవ సాధన` ప్రోగ్రామ్స్‌లో చురుగ్గా పాల్గొన్నారు. మన భారతీయ వారసత్వాన్ని, హస్తకళలను ప్రోత్సహించే `క్రాఫ్ట్‌రూట్స్` వంటి సంస్థల్లోనూ జయనా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అద్భుతమైన విజువల్స్.. కృష్ణుడి కాలానికి తీసుకెళ్లే సెట్టింగులతో ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. పౌరాణిక నేపథ్యం సినిమా అయినా.. మానవ సంబంధాలు, త్యాగం , ప్రేమ వంటి భావోద్వేగాలను ఈ చిత్రం ద్వారా గొప్పగా ఆవిష్కరించబోతున్నారు. సంస్కృతి జయనా తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో లేదో చూడాలి.
