ది రాజాసాబ్ బుకింగ్స్.. ఆదివారం పరిస్థితి ఎలా ఉందంటే..
సంక్రాంతి పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చింది.
By: M Prashanth | 11 Jan 2026 10:14 AM ISTసంక్రాంతి పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చింది. మొదటి రెండు రోజులు వసూళ్ల పరంగా గట్టిగానే సౌండ్ చేసిన ఈ సినిమా మూడో రోజుకు వచ్చేసరికి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం ఈ సినిమా మూడో రోజు అడ్వాన్స్ గ్రాస్ సుమారు 2.7 కోట్లుగా ఉంది.
హైదరాబాద్ లాంటి మేజర్ సెంటర్‌లో కేవలం 54 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతుండటం ఇప్పుడు సినిమా యూనిట్‌కు కాస్త ఆందోళన కలిగించే విషయమే. గత సంక్రాంతి సినిమాలతో పోల్చి చూస్తే ఈ అంకెలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. గతంలో సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం మూడో రోజున దాదాపు 563 షోలతో 65 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసి 4 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ సాధించింది. ఆ స్పీడ్‌తో పోలిస్తే రాజా సాబ్ బాక్సాఫీస్ రన్ నెమ్మదించినట్లు అర్ధమవుతుంది.
సినిమాకు వచ్చిన మిక్స్‌డ్ టాక్ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మీద ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా హారర్ కామెడీ జోనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ ఇక్కడ చాలా కీలకం. సంక్రాంతి సెలవులు కాబట్టి సాధారణంగానే జనాలు థియేటర్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇతర పెద్ద సినిమాల పోటీ కూడా ఉండటంతో ఆడియన్స్ ఆచితూచి అడుగు వేస్తున్నట్లు అర్థమవుతోంది.
గత ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఇదే తరహాలో నెమ్మదించింది. 503 షోల నుంచి కేవలం 29 శాతం ఆక్యుపెన్సీతో 1.5 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ మాత్రమే రాబట్టింది. వీటితో పోలిస్తే రాజా సాబ్ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా ప్రభాస్ ఇమేజ్‌కు ఇది సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలబడాలంటే ఆదివారం వసూళ్లలో భారీ జంప్ ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం రాజా సాబ్ బాక్సాఫీస్ ప్రయాణం కష్టంగానే ఉంది. మొదటి రోజు వంద కోట్లు దాటించి మేకర్స్ ఊపిరి పీల్చుకున్నా లాంగ్ రన్ లో సేఫ్ అవ్వాలంటే ఈ వీకెండ్ కలెక్షన్స్ చాలా ముఖ్యం. సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని లోపాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటంతో దాని ప్రభావం కొత్తగా వచ్చే బుకింగ్స్ మీద పడకుండా చూడాలి.
ఏదేమైనా రాజా సాబ్ ఒక భారీ సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అండ చాలా అవసరం. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడితేనే ఈ సంక్రాంతి రేసులో సినిమా ముందంజలో ఉంటుంది. మరి ఆదివారం నాటి స్పాట్ బుకింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో, రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర తన పట్టు నిలుపుకుంటారో లేదో వేచి చూడాలి.
