Begin typing your search above and press return to search.

సంక్రాంతికి 8 కష్టం.. అసలు డ్రాప్ అయ్యేది ఎవరు?

సంక్రాంతి సినిమాల లిస్ట్ ప్రతీసారి పెద్దగానే ఉంటుంది. నాలుగైదు నెలల ముందే డేట్స్ కోసం క్లాష్ స్టార్ట్ అవుతుంది.

By:  M Prashanth   |   27 Aug 2026 10:33 AM IST
సంక్రాంతికి 8 కష్టం.. అసలు డ్రాప్ అయ్యేది ఎవరు?
X

సంక్రాంతి సినిమాల లిస్ట్ ప్రతీసారి పెద్దగానే ఉంటుంది. నాలుగైదు నెలల ముందే డేట్స్ కోసం క్లాష్ స్టార్ట్ అవుతుంది. చివరకు జనవరి వచ్చేసరికి మాత్రం కొన్ని కనిపించవు. 2027కి కూడా ఇప్పుడు ఎనిమిది సినిమాల వరకు లెక్క చెబుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు సినిమాలకు థియేటర్లు సర్దుకోవచ్చు. ఐదు కూడా గత సంక్రాంతికి వచ్చాయి. ఎనిమిది మాత్రం ఒకేసారి నిలబడటం చాలా కష్టం.

2024లో కూడా మొదట ఆరు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. గుంటూరు కారం, హను మాన్, సైంధవ్, నా సామిరంగ చివరకు వచ్చాయి. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఆలస్యం కావడంతో ముందే తప్పుకుంది. ఈగల్ పూర్తిగా రెడీగా ఉన్నా థియేటర్ల సమస్య రాకుండా ఫిబ్రవరికి వెళ్లింది. అంటే సంక్రాంతి నుంచి సినిమా తప్పుకోవడానికి పని పూర్తికాకపోవడం ఒక్కటే కారణం కాదు. మంచి డేట్ కోసం ఒకరు వెనక్కి తగ్గిన సందర్భం కూడా ఉంది.

ఓ క్లారిటీతో ఉన్న సినిమాలు..

ఈసారి మాత్రం జనవరి 12 విడుదల విషయంలో అనిల్ రావిపూడి వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశాడు. అదే రోజు సాయిదుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా డేట్ వేసుకుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. జనవరి 8న మహాకాళి వస్తోంది. ఇప్పటికే 125 రోజుల షూటింగ్ పూర్తి చేసి చివరి దశ పనుల్లో ఉంది. చిరంజీవి కాకా కూడా జనవరి 13ని అధికారికంగా లాక్ చేసింది. ప్రస్తుతం చూస్తే ఈ నాలుగు సినిమాలే సంక్రాంతి దగ్గరకు ఎక్కువ క్లారిటీతో వెళ్తున్నాయి.

ఇంకా పనిలో ఉన్న సినిమాలు

మిగతా సినిమాల దగ్గర ఇంకా పని ఉంది. శర్వానంద్ జార్జ్ క్రిష్ ఆగస్టులోనే మొదలైంది. జనవరి 14 డేట్ ప్రకటించినా నాలుగు నెలల్లో షూటింగ్, మిగతా పనులు పూర్తి చేయాలి. రవితేజ, హసిత్ గోలి సినిమా పరిస్థితి కూడా అలాంటిదే. ప్రాజెక్ట్‌ను ఇప్పుడే ప్రకటించి జనవరి 14 డేట్ పెట్టారు. సినిమా ఇంకా మొదటి దశలోనే ఉంది. దిల్ రాజు నిర్మాణం కాబట్టి వేగంగా పూర్తి చేసే అవకాశం ఉన్నా, ఇప్పుడే పక్కా అని చెప్పడం తొందరే.

డౌట్ లో ఉన్న సినిమాలు

నాగార్జున కింగ్ 100ను కూడా సంక్రాంతి లెక్కలో వేస్తున్నారు. కానీ నాగ్ స్వయంగా సినిమా 65 శాతం పూర్తయిందని, ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. అది జరిగితే సంక్రాంతి రేసులో ఈ పేరు ఉండదు. రజినీ ధర్మన్ షూటింగ్ అక్టోబర్‌లో పూర్తి చేయాలని అశ్వత్ మారిముత్తు చెబుతున్నాడు. అయితే పొంగల్ రిలీజ్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అందుకే పక్కగా సంక్రాంతికి ఎనిమిదే ఉంటాయని అనుకోవడం కష్టం. పనులు ఆలస్యమైతే జార్జ్ క్రిష్, రవితేజ సినిమా లాంటి వాటికి డేట్ మార్చాల్సి రావచ్చు. కింగ్ 100 ముందే డిసెంబర్‌కు వెళ్లొచ్చు. ధర్మన్ అసలు సంక్రాంతిని ఎంచుకుంటుందా అన్నది ఇంకా తేలలేదు. 2024లో ఈగిల్ చేసినట్టే ఎవరో ఒకరు మంచి సోలో డేట్ కోసం వెనక్కి వెళ్లినా ఆశ్చర్యం లేదు. చివరకు ఈ ఎనిమిదిలో నాలుగు లేదా ఐదు సినిమాలు మిగిలితేనే సంక్రాంతి లెక్క కాస్త సెట్ అవుతుంది.