సంక్రాంతి సినిమాలు.. లెక్క 350 కోట్లు
రఫ్‌గా రూ.350 నుంచి 400 కోట్ల మధ్య లెక్క ఉండొచ్చు. కలెక్షన్స్ లెక్క కంటే ముందు ప్రీ రిలీజ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
By: M Prashanth | 31 Aug 2026 10:13 AM IST2027 సంక్రాంతికి ఇప్పటివరకు ఐదు సినిమాలు డేట్లు పట్టేశాయి. జనవరి 8న మహాకాళి, 12న ‘జనవరి 12 విడుదల’, సంబరాల ఏటిగట్టు, 13న కాకా, 14న జార్జ్ క్రిష్ ఉన్నాయి. వీటి థియేట్రికల్ డీల్స్ అన్నీ ఇంకా బయటకు రాలేదు. కానీ హీరోల గత బిజినెస్, ఇప్పటి మార్కెట్, సినిమాల స్కేల్ చూస్తే ఐదు సినిమాలు కలిపి రూ.300 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. రఫ్‌గా రూ.350 నుంచి 400 కోట్ల మధ్య లెక్క ఉండొచ్చు. కలెక్షన్స్ లెక్క కంటే ముందు ప్రీ రిలీజ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ‘జనవరి 12 విడుదల’కు పెద్ద రేంజ్ కనిపిస్తోంది. వెంకీ, అనిల్ రావిపూడి గత సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ దాదాపు రూ.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. చివరకు రూ.255 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వచ్చింది. ఇప్పుడు అదే దర్శకుడితో వెంకీకి కళ్యాణ్ రామ్ కూడా కలిశాడు. అందుకే ఈ మల్టీస్టారర్ థియేట్రికల్ విలువ రూ.100 నుంచి 120 కోట్ల రేంజ్‌కు వెళ్లినా ఆశ్చర్యం లేదు.
‘కాకా’ దగ్గర లెక్క మరింత పెద్దది. చిరంజీవి గత సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.120 కోట్లుగా ట్రేడ్ లెక్కలు చెప్పాయి. ఆ సినిమా తర్వాత మళ్లీ సంక్రాంతికే వస్తుండటం, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీతో చేస్తున్న సినిమా కావడంతో ‘కాకా’ కూడా రూ.120 నుంచి 135 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చు. జనవరి 13 రిలీజ్‌ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’కు మాత్రం గత మార్కెట్‌తో పోలిస్తే స్కేల్ పెరిగింది. అతని ‘విరూపాక్ష’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.22.5 కోట్లు. ఇప్పుడు ‘సంబరాల ఏటిగట్టు’ను భారీ పీరియడ్ యాక్షన్ సినిమాగా చేస్తున్నారు. షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండటంతో, రిలీజ్‌కు ముందు వచ్చే కంటెంట్‌ను బట్టి రూ.30 నుంచి 40 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరగొచ్చనే లెక్క వేసుకోవచ్చు.
‘మహాకాళి’కి హీరో మార్కెట్ కంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరే పెద్ద బలం. ‘హనుమాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు అదే యూనివర్స్‌లో పూజ కొల్లూరు దర్శకత్వంలో ‘మహాకాళి’ వస్తోంది. అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ఉండటం, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ కూడా ఉంది. అయితే లీడ్ సెటప్ పూర్తిగా కొత్తది కావడంతో ఇప్పుడే భారీ రేట్లు ఫిక్స్ చేయలేం. టీజర్ తర్వాత ఉన్న స్థాయిని బట్టి రూ.30 నుంచి 45 కోట్ల రేంజ్ ఒక ప్రాక్టికల్ అంచనా.
శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’. జనవరి 14 రిలీజ్ అని లాంచ్ రోజే ప్రకటించారు. నైజాం నుంచి సీడెడ్ వరకు డిస్ట్రిబ్యూటర్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి, కానీ ఎంత ధరకు హక్కులు వెళ్లాయన్న లెక్క మాత్రం చెప్పలేదు. శర్వానంద్‌కు సంక్రాంతి కొత్త కాదు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ దాదాపు రూ.13.3 కోట్ల వరల్డ్‌వైడ్ షేర్, ‘శతమానం భవతి’ దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ చేసింది. శ్రీను వైట్లతో చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.18 నుంచి 25 కోట్ల థియేట్రికల్ రేంజ్ ఉండొచ్చు.
