పండక్కి అన్నయ్యతో పోటీ తప్పేలా లేదే!
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా పండగ బరిలో ఉంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 22 Aug 2025 4:04 PM ISTసినీ ఇండస్ట్రీకి.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కు సంక్రాంతి పండుగ చాలా పెద్ద సీజన్. పిల్లలు, పెద్దలు అందరూ సెలవుల్లో ఫ్రీ గా ఉంటారు. సెలవులుంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అందుకే ఈ సీజన్ గురించి తెలిసిన ఎవరూ సంక్రాంతిని లైట్ తీసుకోరు. ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాతలు ఈ పండగను టార్గెట్ గా చేసుకుని చాలా నెలల ముందుగానే తమ సినిమాలను పండగ బరిలో దింపడానికి కర్ఛీఫ్ వేస్తుంటారు.
ఇప్పటికే చిరూ బెర్త్ కన్ఫర్మ్
కానీ సమయం దగ్గర పడే కొద్దీ వివిధ కారణాల వల్ల కొన్ని సినిమాలు పోటీ నుంచి తప్పుకుంటే మరికొన్ని సినిమాలు కొత్తగా రేసులో జాయినవుతుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి కాస్త పోటీ ఎక్కువగానే ఉండేలా అనిపిస్తోంది. ఇప్పటికే చిరూ- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి రిలీజ్ ను ఫిక్స్ చేసుకుంది.
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా పండగ బరిలో ఉంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. డిసెంబర్ లో రావాల్సిన రాజా సాబ్ ను పండక్కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నిర్మాతలున్న విషయం తెలిసిందే. అఖండ2 సెప్టెంబర్ 25 నుంచి వాయిదా వేసి సంక్రాంతికే రిలీజ్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. వీరితో పాటూ మాస్ మహారాజ్ రవితేజ సినిమా ఒకటి కూడా సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే.
రవితేజ కూడా..
ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో బిజీగా ఉన్న రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. అక్టోబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫారిన్ షెడ్యూల్ ను స్పెయిన్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే జరిగితే రెండేళ్ల కిందట వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరూ, రవితేజ, ఈసారి బాక్సాఫీస్ వద్ద తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఖాయం.
