2026 సంక్రాంతి రేస్.. ఆ ఒక్కటే సరిపోదు..
2026 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు ఒక రియల్ టెస్ట్ లా మారబోతోంది. ఏకంగా ఐదు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటం మామూలు విషయం కాదు.
By: M Prashanth | 9 Dec 2025 10:00 AM IST2026 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు ఒక రియల్ టెస్ట్ లా మారబోతోంది. ఏకంగా ఐదు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటం మామూలు విషయం కాదు. అయితే గతంలో లాగా కేవలం హీరోల కటౌట్లు చూసి జనం థియేటర్లకు వస్తారా లేదా అనేది సందేహమే. ఆడియెన్స్ మైండ్ సెట్ మారింది. అందుకే ఈసారి పోటీలో ఎవరు గెలుస్తారనేది పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ పవర్ ఓపెనింగ్స్ ఇస్తుందేమో కానీ, లాంగ్ రన్ మాత్రం కథలోని దమ్ము మీదే డిపెండ్ అవుతుంది.
అందరి ఫోకస్ నేచురల్ గానే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' మీదే ఉంది. పాన్ ఇండియా స్టార్ కాబట్టి అంచనాలు స్కై రేంజ్ లో ఉంటాయి. అయితే ఇక్కడ ఫ్యాన్స్ లోనూ, ట్రేడ్ లోనూ ఉన్న చిన్న డౌట్ ఏంటంటే.. డైరెక్టర్ మారుతి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందనేది. వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తానని మారుతి చెబుతున్నా, ఆ స్కేల్ ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారనే దానిపైనే సినిమా రిజల్ట్ ఉంటుంది. మారుతి గనక మ్యాజిక్ చేస్తే రికార్డులు బద్దలవ్వడం ఖాయం.
ఇక మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' విషయంలో స్ట్రాటజీ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి ఎప్పటిలాగే తన ఫేవరెట్ సేఫ్ జోన్ అయిన కమర్షియల్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేశారు. పండగకి ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కడతారనేది నిజమే. కానీ, ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు కేవలం ఆ జానర్ అడ్వాంటేజ్ మాత్రమే సరిపోదు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటే తప్ప, మిగతా స్టార్స్ కాంపిటీషన్ ని తట్టుకుని ఈ సినిమా సర్వైవ్ అవ్వడం కష్టం.
మరోవైపు రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పరిస్థితిని ప్రాక్టికల్ గా అనలైజ్ చేస్తే.. ఆన్ పేపర్ మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇది కొంచెం వీక్ గానే అనిపిస్తోంది. టైటిల్ పరంగా గానీ, బజ్ పరంగా గానీ ఇంకా పీక్స్ కి వెళ్ళలేదు. కానీ రవితేజను మనం తక్కువ అంచనా వేయలేం. ఆయనకు పర్ఫెక్ట్ కంటెంట్ దొరికితే సీన్ మొత్తం మార్చేస్తారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఈ సంక్రాంతికి ఈ సినిమానే గేమ్ ఛేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది.
యంగ్ హీరోల సినిమాల విషయానికి వస్తే.. 'అనగనగా ఒక రాజు' సక్సెస్ భారం మొత్తం నవీన్ పొలిశెట్టి మీదే ఉంది. ఇది పూర్తిగా వన్ మ్యాన్ షో. ఆయన కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ క్లిక్ అయితేనే సినిమా నిలబడుతుంది. ఇక శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' కూడా రేసులో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు దీనిపై అఫీషియల్ గా పెద్ద బజ్ క్రియేట్ అవ్వలేదు. ప్రమోషన్స్ విషయంలో టీమ్ అర్జెంట్ గా గేర్ మార్చాల్సిన అవసరం ఉంది.
ఫైనల్ గా 2026 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ ఈసారి చాలా కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలు ఉన్న సినిమాలు డిజప్పాయింట్ చేయొచ్చు, అంచనాలు లేని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు. అంతిమంగా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసే సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమానే విన్నర్ గా నిలుస్తుంది. స్టార్ డమ్ కంటే కంటెంటే ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. చూడాలి మరి కంటెంట్ పరంగా బాక్సాఫీస్ వద్ద ఎవరు విన్ అవుతారో..!
