Begin typing your search above and press return to search.

సంక్రాంతి బరిలో నెగ్గేదెవరు?

ఇకపోతే ఈ చిత్రాలలో చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతోపాటు ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

By:  Madhu Reddy   |   21 Dec 2025 1:00 PM IST
సంక్రాంతి బరిలో నెగ్గేదెవరు?
X

మిగతా భాషా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే మూడు రోజులను క్యాష్ చేసుకోవడానికి పెద్ద హీరోలను మొదలుకొని.. చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ సినిమాలను పోటీకి దింపుతుంటారు. అలా ఈసారి కూడా చాలా సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అని పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి..మరి ఈ సంక్రాంతి బరిలో చిరంజీవిని మొదలుకొని శర్వానంద్ వరకు చాలామంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

అటు నిర్మాతలు కూడా ఈ మూడు రోజులను క్యాష్ చేసుకోవడానికి ముందే డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు తమ సినిమాలకు కావాల్సినన్ని థియేటర్లను కూడా బుక్ చేసుకుంటున్నారు. అలా భారీ హడావిడి మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఏ ఏ చిత్రాలు నిలవనున్నాయి. అలా రాబోతున్న చిత్రాలలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవనుంది? అనే ప్రశ్నలు అభిమానులలో అప్పుడే మొదలయ్యాయి. మరి సంక్రాంతికి రాబోతున్న చిత్రాలు ఏంటి? ఏ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ది రాజా సాబ్:

మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే డిసెంబర్ 27న మరో కొత్త ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించడానికి మారుతి సిద్ధమైపోయారు. మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా తెగ ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

జన నాయకుడు:

సంక్రాంతి బరిలో తెలుగు చిత్రాలే కాదు తమిళ్ చిత్రాలు కూడా డబ్బింగ్ అయ్యి తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాంటి చిత్రాలలో విజయ్ దళపతి జన నాయకుడు సినిమా కూడా ఒకటి. తమిళ్లో జన నాయగన్ పేరిట రిలీజ్ అవుతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ మూవీకి పోటీగా జనవరి 9న విడుదల చేస్తున్నారు.

పరాశక్తి:

గురు, ఆకాశమే నీ హద్దురా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా , శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.

మన శంకర వరప్రసాద్ గారు:

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. దీంతో జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి:

ఈ మధ్యనే మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ను చవిచూశారు.. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అసలే సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా.. కిషోర్ కే తిరుమల దర్శకత్వం వహించారు.

అనగనగా ఒక రాజు:

చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించిన నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది.

నారీ నారీ నడుమ మురారి:

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా వస్తున్న నారీ నారీ నడుమ మురారి చిత్రం జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇకపోతే ఈ చిత్రాలలో చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతోపాటు ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరొకవైపు ఈ చిత్రాలన్నీ కూడా సంక్రాంతికి ముస్తాబవుతున్నాయి. మరి చివరి నిమిషంలో ఏ సినిమా అయినా వాయిదాపడే అవకాశాలు కూడా లేకపోలేదు.