సంక్రాంతి రేసు.. ట్విస్ట్ మీద ట్విస్ట్
తెలుగు సినిమాల వరకు అత్యంత డిమాండ్ ఉండే సీజన్ అంటే సంక్రాంతినే. చాలా ముందుగానే ఆ సీజన్‌కు బెర్తులు బుక్ అవుతుంటాయి.
By: Garuda Media | 8 Sept 2025 9:57 PM ISTతెలుగు సినిమాల వరకు అత్యంత డిమాండ్ ఉండే సీజన్ అంటే సంక్రాంతినే. చాలా ముందుగానే ఆ సీజన్‌కు బెర్తులు బుక్ అవుతుంటాయి. కానీ కర్చీఫ్ వేసిన వాళ్లందరూ కచ్చితంగా ఆ సీజన్లో వస్తారని గ్యారెంటీ ఏమీ ఉండదు. ఆర్నెల్ల ముందు మొదలయ్యే రేసులో చివరికి మూణ్నాలుగు సినిమాలు నిలుస్తుంటాయి. మధ్యలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఐతే 2026 సంక్రాంతి సీజన్‌కు సంబంధించి ఆల్రెడీ బెర్తులు కన్ఫమ్ అయిపోయాయని.. ఇక మార్పులేమీ ఉండవని అంతా ఒక అంచనాకు వచ్చేశారు.
మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడిల ‘మన శంకర వరప్రసాద్’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలు చాలా ముందే సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకుని.. ఆ దిశగా సినిమాలను రెడీ చేసే పనిలో ఉన్నాయి. ఇటీవలే ‘రాజా సాబ్’ కూడా సంక్రాతికే అని ఖరారైంది. మరోవైపు తమిళ అనువాదం ‘జనగాయగన్’ కూడా రేసులో ఉంటుందన్నది స్పష్టం. ఇంతకుమించి సినిమాలు వచ్చినా థియేటర్లను సర్దుబాటు చేయడం కష్టం. కాబట్టి అంతటితో పోటీ ముగిసిందని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు కొత్తగా సినిమాలు పోటీలోకి వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. మాస్ రాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిస్తున్న సినిమాను ఇంతకుముందు సంక్రాంతికే తీసుకురానున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ మొదలయ్యాక దీని గురించి ఏ అప్‌డేట్ లేదు. కొన్ని నెలల పాటు చిత్ర బృందం సైలెంట్‌గా ఉండడంతో ఇది సంక్రాంతికి రాదనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ సినిమా పండక్కి పక్కా అంటున్నారు. సంక్రాంతికి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేలా ఓటీటీ డీల్ కూడా పూర్తయిందట. కాబట్టి మాస్ రాజా కూడా సంక్రాంతి పోటీలో ఉండడం గ్యారెంటీ అంటున్నారు. మరోవైపు శర్వానంద్ హీరోగా ‘సామజవరగమన’ దర్శకుడు భాను భోగవరపు తీస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ సినిమా సైతం పండుగ పోటీలో ఉన్నట్లు ఆ చిత్ర బృందం మీడియాకు లీకులు వదిలింది. త్వరలోనే వాళ్లు కూడా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట.
మరి ఇన్ని సినిమాలకు సంక్రాంతి సీజన్లో చోటు ఎక్కడ ఉందన్నది ప్రశ్న. బహుశా ఆల్రెడీ పోటీలో ఉన్న వాటిలో ఏదైనా తప్పుకుంటే తమ సినిమాను దించుదామని ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ప్రభాస్, చిరు సినిమాలు ఉండగా తెలుగు నుంచి ఇంకొక్క సినిమాకు మించి థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది. కలెక్షన్ల పరంగా చూసినా కూడా మూడుకు మించి పోటీ ఉంటే ఇబ్బంది తప్పదు.
