ప్రభాస్ కోసం సందీప్‌రెడ్డి వంగ..మరి చిరు కోసం..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ `ది రాజాసాబ్`. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
By: Tupaki Entertainment Desk | 5 Jan 2026 3:46 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ `ది రాజాసాబ్`. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రభాస్ తొలి సారి కామెడీ హారర్ జానర్‌ని ట్రై చేస్తున్న ఈ మూవీలో క్రేజీ భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. జనవరి 9న భారీ స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. ప్రమోషన్స్ కూడా ఊపందుకోవడంతో `ది రాజాసాబ్` వైరల్ అవుతోంది.
ఓటీటీ రైట్స్, థియేట్రికల్ బిజినెస్ పరంగా ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన 'ది రాజాసాబ్' ప్రమోషన్స్ పరంగానూ ట్రెండ్ కావాలని మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్ని ముందుండి నడిపిస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా వైడ్‌గా 'ది రాజాసాబ్'ని వైరల్ చేయడం కోసం కొత్త ప్లాన్ వేసినట్టుగా ఇటీవల ప్రచారం కావడం, ఇందు కోసం క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగని రంగంలోకి దించేస్తున్నాడని, ప్రత్యేకంగా తనతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌తో పాటు ముగ్గురు హీరోయిన్‌లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంటారట.
వీరందరితో కలిసి సందీప్ రెడ్డి వంగ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయబోతున్నాడని, ఇందులో స్పిరిట్ కు సంబంధించిన విషయాలు కూడా చర్చకు వస్తాయని చెబుతున్నారు. ప్రభాస్ నటించిన తొలి కామెడీ హారర్ థ్రిల్లర్ కావడం, సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి దిగ్గజాలు నటించడంతో సందీప్ ప్రశ్నలు మరింత ఆసక్తిగా, ఫన్నీగా సాగనున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే 'ది రాజాసాబ్' కోసం సందీప్‌రెడ్డి వంగాని రంగంలోకి దించుతున్నట్టే మెగాస్టార్ 'మన శంకరవరప్రసాద్ గారు' కోసం మరో స్టార్ రంగలోకి దిగుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తనే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ మూవీని షైన్ క్రియేషన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్దితో కలిసి మెగా డాటర్ సుష్మిత నిర్మించింది. అనౌన్స్‌మెంట్ వీడియో నుంచే అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ని అనిల్ రావిపూడి, సుష్మిత అండ్ కో హోరెత్తిస్తున్నారు. ఓవర్సీస్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా వీడియో కాల్ సెషన్‌ని నిర్వహించిన టీమ్ దీనికి సంబంధించిన వీడియోని త్వరలో రిలీజ్ చేయబోతోంది. ఇదే తరహాలో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడిలతో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రత్యేక చిట్ చాట్‌ని ఏర్పాటు చేస్తున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సుష్మిత ఈ ప్రాజెక్ట్‌కి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం, మెగాస్టార్ నటించడం వంటి కారణాలతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ని ప్రత్యేకంగా ప్రమోషన్స్‌కి రంగంలోకి దించేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే నిజమైతే తండ్రి కొడుకులు కలిసి చేసే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో 'మన శంకరవరస్రసాద్ గారు' విషయాలే మాట్లాడతారా? లేక చరణ్ 'పెద్ది' విశేషాలు కూడా చర్చకు వస్తాయా? అన్నది వేచి చూడాల్సిందే.
