సంక్రాంతికి నాలుగు కాదా.. ఆరు చిత్రాలా?
టాలీవుడ్ కు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా చిత్రాలు కచ్చితంగా భారీ వసూళ్లు రాబడతాయి.
By: M Prashanth | 8 Sept 2025 12:58 PM ISTటాలీవుడ్ కు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా చిత్రాలు కచ్చితంగా భారీ వసూళ్లు రాబడతాయి. పాజిటివ్ టాక్ వస్తే దూసుకుపోతాయి. దీంతో అప్పుడే తమ సినిమాలు రిలీజ్ చేయాలని అంతా యోచిస్తుంటారు. అందుకే ఇంకా కొన్ని నెలలు సమయమున్నా... అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతి వేడెక్కుతోంది.
పొంగల్ సీజన్ కు ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫులు వేసేశాయి. కానీ ఎన్ని రిలీజ్ అవుతాయన్నది చెప్పలేం. ఎందుకంటే కొన్ని చిత్రాలు సడెన్ గా తప్పుకుంటాయి. ఇంకొన్ని సడెన్ గా ఎంట్రీ కూడా ఇస్తాయి. ఇది ఏటా జరుగుతున్న విషయమే. అయితే ఇప్పటి వరకు వచ్చే ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రానున్నట్లు చిన్న కన్ఫర్మేషన్ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అనుకున్న షెడ్యూల్స్ కూడా పూర్తి చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ కూడా పొంగల్ కే విడుదల కానుంది.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. నిజానికి డిసెంబర్ లో రిలీజ్ కానుంది. కానీ ఇప్పుడు జనవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత విశ్వప్రసాద్ ఓ కార్యక్రమంలో తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఈ రెండు బడా సినిమాలతోపాటు కామిక్ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు చిత్రం కూడా విడుదల కానుంది.
నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీని మరి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జన నాయగన్ తెలుగు, తమిళ భాషలలో విస్తృతంగా విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ చివరి చిత్రంగా రానున్న ఆ మూవీ సంక్రాంతికే విడుదల కానుంది. అలా ఇప్పటివరకు నాలుగు సినిమాలు అయితే ఫిక్స్ అయ్యాయి.
ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా రానున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతున్న మూవీని సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన శర్వానంద్ నారి నారి నడుమ మురారిని కూడా అప్పుడే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది కనుక నిజమైతే ఈసారి గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో.. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో వేచి చూడాలి.
