తెలుగు హీరోలకు విజయ్ ఊరటనిస్తాడా?
ప్రతీ ఏడాది లాగానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈసారి తెలుగులో పోటీ కాస్త గట్టిగానే ఉండేట్టుంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Oct 2025 8:00 PM ISTసినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతినే. విడి రోజుల్లో ఒక టికెట్ తెగితే, పండగ టైమ్ లో ఫ్యామిలీ టికెట్స్ మొత్తం తెగడంతో పండగ సీజన్ ను చాలా మంది దర్శకనిర్మాతలు టార్గెట్ చేస్తూ, తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అందులో భాగంగానే ప్రతీ ఏడాది కొన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజవుతూ తమ లక్ ను టెస్ట్ చేసుకుంటూ ఉంటాయి.
ఈసారి సంక్రాంతికి భారీ పోటీ
ప్రతీ ఏడాది లాగానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈసారి తెలుగులో పోటీ కాస్త గట్టిగానే ఉండేట్టుంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు అందరి కంటే ముందుగా తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ కూడా డిసెంబర్ నుంచి వాయిదా పడి సంక్రాంతికే రిలీజ్ కానుంది. వీటితో పాటూ రవితేజ- కిషోర్ తిరుమల సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా పండగకే షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు పండగ రేసులో నిలవగా, తాజాగా శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి కూడా పండగకే వస్తుందని అంటున్నారు.
జనవరి 9న రావాల్సిన జన నాయగన్
అవి కాకుండా దళపతి విజయ్ ఆఖరి సినిమాగా తెరకెక్కుతున్న జన నాయగన్ కూడా పండగ బరిలోనే రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు జన నాయగన్ మూవీ పండగ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. జన నాయగన్ జనవరి 9న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు అది రావడం లేదంటున్నారు. రీసెంట్ గా తమిళనాడులో విజయ్ రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా సినిమా రిలీజ్ కు ఇది సరైన టైమ్ కాదని భావించి విజయ్ ఆ మూవీని పండగ బరి నుంచి తప్పించారంటున్నారు.
ఒకవేళ ఇదే నిజమైతే మిగిలిన సినిమాలకు పోటీ పరంగా కాస్త ఊరట లభించే అవకాశముంది. విజయ్ తమిళ హీరోనే అయినప్పటికీ అతనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో విజయ్ పండగ బరి నుంచి తప్పుకుంటే ఇక్కడి సినిమాలకు థియేటర్ల పరంగా మరియు పోటీ పరంగా ప్లస్ అయ్యే ఛాన్సుంది. చూడాలి మరి జన నాయగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
