సంక్రాంతి కలెక్షన్స్.. నమ్మలా వద్దా?
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈసారి ఐదు సినిమాల మధ్య గట్టి పోటీ కనిపించింది. అయితే థియేటర్ల వద్ద సందడి ఎంత ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం కలెక్షన్ల పోస్టర్ల చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 20 Jan 2026 9:35 AM ISTసంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈసారి ఐదు సినిమాల మధ్య గట్టి పోటీ కనిపించింది. అయితే థియేటర్ల వద్ద సందడి ఎంత ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం కలెక్షన్ల పోస్టర్ల చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. ది రాజాసాబ్, మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు మేకర్స్ మాత్రమే నంబర్లతో పోస్టర్లు వదులుతుంటే, మిగిలిన వారు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు.
నారీ నారీ నడుమ మురారి నిర్మాత అనిల్ సుంకర కేవలం రిపోర్ట్స్‌ను రీట్వీట్ చేస్తూ సరిపెడుతుంటే, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీమ్ అసలు నంబర్ల జోలికే వెళ్లడం లేదు. సంక్రాంతి సినిమాల కలెక్షన్లు కొన్ని ఒరిజినల్ నెంబర్లకు అటు ఇటుగా దగ్గరగానే ఉన్నాయి. మరికొన్ని పోస్టర్స్ గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
వాస్తవానికి ఈ కలెక్షన్ల పోస్టర్లు అనేవి కేవలం సినిమా మీద ఒక బజ్ క్రియేట్ చేయడానికి, ఫ్యాన్స్ మధ్య ఒక హడావుడి చేయడానికి మాత్రమేననేది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. పోస్టర్లపై వేసే నంబర్లు ప్రేక్షకుల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఈగోను సంతృప్తి పరచడానికే ఉంటాయని గతంలోనే కొందరు ప్రముఖ నిర్మాతలు, బహిరంగంగానే చెప్పారు. అబద్ధమని తెలిసినా, ఆ నంబర్లతో వచ్చే హైప్ సినిమా బిజినెస్‌కు హెల్ప్ అవుతుందనేది వారి నమ్మకం.
కొందరు దర్శకులు, హీరోలు మొదట్లో తాము ఇలాంటి ఫేక్ నంబర్ల పోస్టర్లు వేయమని చెప్పినా, ఆ తర్వాత మళ్ళీ అదే రూట్‌లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతలకు ఇష్టం లేకపోయినా, పక్కన ఉన్న పెద్ద సినిమాలతో పోటీ పడలేక ఇలాంటి హడావుడి చేయక తప్పడం లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్న సినిమాలకు, జనాన్ని థియేటర్లకు రప్పించడానికి ఈ కలెక్షన్ల పోస్టర్లు ఒక మార్కెటింగ్ టూల్‌లా మారిపోయాయి.
కానీ ఒక సినిమాకు సంబంధించి అక్యురేట్ నంబర్లు అనేవి కేవలం ఆ నిర్మాతకు మాత్రమే తెలుస్తాయి. వాళ్ళు నేరుగా అఫీషియల్ డేటాను బయట పెట్టరు కాబట్టి, ఫ్యాన్స్ తమకు నచ్చిన లెక్కలను ప్రచారం చేసుకుంటున్నారు. ఫలితంగా అసలైన కలెక్షన్స్ ఏంటి అనే విషయం కంటే, ఏ సినిమా పోస్టర్ మీద పెద్ద నంబర్ ఉంది అనేదే హైలెట్ అవుతోంది. ఈ సంక్రాంతికి సక్సెస్ పరంగా మంచి వసూళ్లు అయితే వచ్చాయి కానీ, పోస్టర్లపై ఉన్న నంబర్లు వంద శాతం వాస్తవం అని నమ్మడం కష్టమే.
