రవితేజ ఈసారి రిస్క్ చేయకపోవడమే బెటర్
అందుకే భారీ సినిమాల నుంచి చిన్న, మధ్య తరహా సినిమాల వరకు ఈ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేసి ఆ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Nov 2025 10:57 AM ISTసినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ ను చాలా పెద్ద సీజన్ గా భావిస్తారనే సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేసి, ఫ్యామిలీలను మొత్తం థియేటర్లకు రప్పించి మంచి కలెక్షన్లు అందుకోవచ్చనే ఉద్దేశంతో పెద్ద సినిమాల మేకర్స్ ఎక్కువగా సంక్రాంతి సీజన్ పై కన్నేస్తారు. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి కూడా.
2026 సంక్రాంతికి భారీ పోటీ
అందుకే భారీ సినిమాల నుంచి చిన్న, మధ్య తరహా సినిమాల వరకు ఈ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేసి ఆ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2026 సంక్రాంతికి పలు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీతో పాటూ కోలీవుడ్ నుంచి విజయ్ జననాయగన్, శివ కార్తికేయన్ పరాశక్తి రేసులో ఉన్నాయి.
గత కొంతకాలంగా ఫామ్ లో లేని రవితేజ
అయితే వీటన్నింటిలో ఏ సినిమాకు ఉండే క్రేజ్ వాటికుండగా, వీరందరిలో సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయి రిస్క్ చేస్తుంది మాత్రం రవితేజ అనే చెప్పాలి. దానికి కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మినిమం లాభాలను ఇచ్చే హీరోగా పేరున్న మాస్ మహారాజా రవితేజ గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్నారు. సరైన స్క్రిప్ట్ సెలెక్షన్ లేకపోవడంతో అతని సినిమాలు ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. ఈ కారణంతో రవితేజ తన సొంత ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఇలాంటి టైమ్ లో రవితేజ తన తర్వాతి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవితేజ తన నెక్ట్స్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తిని కిషోర్ తిరుమలతో చేస్తుండగా, ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటూ ఈ సినిమా రవితేజకు కచ్ఛితంగా కంబ్యాక్ ఇస్తుందని, అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరిస్తుందని అందరూ నమ్ముతున్నారు.
అయితే ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుందని అందరూ నమ్ముతున్నప్పటికీ, సంక్రాంతి భారీ పోటీలో రిలీజ్ చేస్తే ఆ టైమ్ లో థియేటర్లతో పాటూ కలెక్షన్లు కూడా మిగిలిన వారికి షేర్ అయ్యే ప్రమాదముందని, అందుకే సోలోగా రావడమో లేదా కాస్త తక్కువ పోటీలోనో సినిమాను రిలీజ్ చేసుకోవడం మంచిదని పలువురు చిత్ర యూనిట్ కు సూచిస్తున్నారు. రవితేజ సినిమాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, అదే సీజన్ లో రిలీజైన మరో
సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే అక్కడ కూడా ఆడియన్స్ షేర్ అవుతారు. ప్రస్తుతం రవితేజ బ్యాడ్ ఫేజ్ లో ఉన్న కారణంతో ఈ సినిమాను భారీ పోటీతో కాకుండా పోటీ తక్కువ ఉన్న సీజన్ లో రిలీజ్ చేస్తే అది మాస్ మహారాజా కెరీర్ కు చాలా ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు. మరి ఇవన్నీ ఆలోచించుకుని మేకర్స్ ఏమైనా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.
