సంక్రాంతి జోష్ కొనసాగుతుందా? క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందా?
కొత్త కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు మళ్లీ సంక్రాంతి సినిమాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త విడుదలలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
By: M Prashanth | 2 Feb 2026 5:00 PM ISTసంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు ఎప్పుడూ పెద్ద పండుగే. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. పొంగల్ సందర్భంగా ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాయి. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి.
వీటిలో మూడు సినిమాలు మంచి విజయం సాధించగా, రెండు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా థియేటర్లలో మాత్రం సందడి తగ్గలేదు. పండుగ వాతావరణంతో కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంచి లాభాలు అందుకున్నారు. ముఖ్యంగా హిట్ అయిన సినిమాలు రెండు మూడు వారాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టాయి.
దీంతో సంక్రాంతి తర్వాత కూడా అదే సినిమాలు రన్ కొనసాగించాయి. అయితే పండుగ తర్వాత పరిస్థితి కొంత నెమ్మదించింది. గత వారం విడుదలైన రెండు చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద నిరాశపరించాయి. కొత్త కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు మళ్లీ సంక్రాంతి సినిమాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త విడుదలలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఇప్పుడు పరిస్థితి మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం మాత్రం చిన్న సినిమాల జోరు కనిపిస్తోంది. అరడజనుకు పైగా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన యుఫోరియా కొంత హైప్ తెచ్చుకోగా, హనీ, శ్రీ చిదంబరం గారు, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, ఎర్ర చీర, లగ్గం టైమ్ వంటి సినిమాలు కూడా పోటీలో నిలుస్తున్నాయి.
అయితే ఆ చిత్రాలపై పెద్దగా బజ్ కనిపించడం లేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, భారీ ప్రమోషన్స్ లేకపోవడం ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో తమిళ డబ్బింగ్ చిత్రం విత్ లవ్ తో పాటు ఆరెంజ్, సలార్, 3 వంటి చిత్రాలు రీ-రిలీజ్ కానున్నాయి. అదే సమయంలో సంక్రాంతి సినిమాలు తమ థియేట్రికల్ రన్ ను దాదాపు పూర్తి చేసుకుని ఓటీటీ వేదికల వైపు అడుగులు వేస్తున్నాయి.
దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలే ఇప్పుడు బాక్సాఫీస్ కు ఊపుని ఇవ్వాలి. పాజిటివ్ టాక్, మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించగలవని గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి మ్యాజిక్ ఈ వారం కూడా రిపీట్ అవుతుందా? లేదంటే బాక్సాఫీస్ మళ్లీ నెమ్మదిస్తుందా? అన్నది చూడాలి. మొత్తానికి, సంక్రాంతి జోష్ కొనసాగాలంటే చిన్న సినిమాల్లో కనీసం ఒకటి రెండు హిట్లు అవ్వాల్సిందే. ప్రేక్షకుల తీర్పే ఇప్పుడు మెయిన్. మరేం జరుగుతుందో చూడాలి.
